డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారత్‌ తరఫున వెళ్తున్న కేంద్ర మంత్రి ఎవరో తెలుసా?

ఈ కార్యక్రమానికి హాజరుకావాలని భారత్‌కు ఆహ్వానం అందింది.

Donald Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత్‌ తరఫున ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ వెళ్లనున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ట్రంప్-వాన్స్ కమిటీ ఆహ్వానాన్ని పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఎక్స్‌లో తెలిపింది. జయశంకర్‌ పర్యటన భారత్‌-అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత సుస్థిరం చేస్తుందని అధికారులు అంటున్నారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాక జై శంకర్‌ ఆ దేశ పరిపాలనా ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. అలాగే, ఇతర దేశాల ప్రముఖులతోనూ చర్చల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశాక అమెరికా దేశీయ, విదేశాంగ విధానంలో కొత్త దశకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాకు భారత్ కీలక మిత్రదేశంగా ఉంది. దీంతో అమెరికా తీసుకోనున్న నిర్ణయాలు, హెచ్‌1-బీ వీసా సంస్కరణలు, ఇండో-పసిఫిక్ ప్రాంతం వంటి సమస్యలపై పరిపాలన వైఖరిని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. కాగా, జనవరి 20న అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ డే కూడా ఉంది. అమెరికాలో ఆ రోజు జాతీయ సెలవు దినం.

Anita Anand: కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకున్న భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. కారణం ఏమిటంటే?