కొలంబోలో మరో పేలుడు(మానవ బాంబు) ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దేహీవాలాజూ ప్రాంతంలోని ఓ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏప్రిల్ 21 ఉదయం నుంచి జరిగిన పేలుళ్లలో వందల కొద్దీ ప్రాణనష్టం జరిగింది. దేహీవాలా ప్రాంతంలో బాంబు ప్రమాదం వార్త విన్న కాసేపటికే మరో పేలుడితో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు.
ఒకటి తర్వాత మరొకటి పేలడంతో మరో పేలుడు వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రాణాలు గుప్పిట్లో బతుకుతున్నారు. మధ్యాహ్నం సమయానికి వరుసగా 7ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది.
ప్రమాదస్థలిలో ఇప్పటికీ 160 మందికిపైగా మృతి చెందినట్లు గుర్తించారు. మరో 500 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొలంబోలోని కొచ్చికోడ్ ప్రాంతంలో ప్రముఖ సెయింట్ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు.
ఈ దుశ్చర్యలకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాద సంస్థల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘటనలో పలు చర్చిలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. క్షతగాత్రలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.