South Korea Presidents comments
South Korea President’s comments: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అందుకు ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అమెరికా నుంచి ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ కావాలని దక్షిణ కొరియా కోరింది. అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన యూన్ సుక్-యోల్ తన మాటలు ఎవరూ వినడం లేదని భావించి అమెరికా చట్టసభ సభ్యులను తిట్టారు.
‘‘ఒక వేళ ఈ ఇడియట్లు అమెరికా కాంగ్రెస్ లో ఇందుకు అడ్డుపడితే బైడెన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు’’ అంటూ ఓ విషయంపై విదేశాంగ మంత్రి పార్క్ జిన్ తో అన్నారు. అయితే, ఆ సమయంలో ఆయనకు దగ్గరలోనే ఓ మైక్రోఫోన్ ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు దక్షిణ కొరియా టీవీలో ప్రసారమయ్యాయి.
దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ… ‘‘యూన్ సుక్-యోల్ వ్యాఖ్యలు అనధికారికం, అంతేగాక, ఆ వ్యాఖ్యలు ఆయనే చేశారా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే, దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా యూన్ సుక్-యోల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దక్షిణ కొరియా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.