SpaceX Rocket Moon Crash : చంద్రుడిపై కుప్పకూలనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం.. భూమికి ప్రమాదం పొంచిఉందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.
SpaceX Rocket Moon Crash : స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన రాకెట్ శకలం వేగంగా దూసుకెళ్లి ఆగస్టు 5న చంద్రుడిపై కుప్పకూలనుంది.
- Harish Thanniru
- Published on- July 28, 2026 / 08:44 AM IST
SpaceX Rocket Moon Crash
- జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం..
- ఆగస్టు 5వ తేదీన శరవేగంతో చంద్రుడిపైకి
- భూమికి ప్రమాదం పొంచిఉందా?
SpaceX Rocket Moon Crash : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన ప్రముఖ అమెరికన్ అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ ఎక్స్ గత ఏడాది చంద్రుడిపైకి ఒక రాకెట్ ను ప్రయోగించింది. రెండు ల్యాండర్లను జాబిల్లిపైకి పంపాలన్న ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. అయితే, వాడేసిన ఒక భాగం మాత్రం కొంచెం దూరంలో తిరుగుతూ ఉంది. అస్థిర కక్ష్యంలో వదిలేసిన కారణంగా అది చంద్రుడి వైపు దూసుకెళ్తుంది. ఆగస్టు 5వ తేదీన చంద్రుడిపై ఈ రాకెట్ శరవేగంతో కుప్పకూలిపోనుంది.
Also Read : Arunachala : అరుణాచలం మోక్షమార్గంలో చిక్కుకుపోయిన ఏపీ మహిళ.. తప్పిన ప్రమాదం.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఈ రాకెట్ భూమిపైకి తిరిగివచ్చేందుకు ఇంధనం లేదు. దీంతో చంద్రుడి ఆకర్షణ శక్తి కారణంగా ఆగస్టు 5వ తేదీన గంటకు 8700 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లి జాబిల్లిపై పడిపోనుంది. ఈ ధాటికి సుమారు 60 నుంచి 70 అడుగుల భారీ గుంత పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ చంద్రుడిపై కుప్పకూలిపోవడం వల్ల భూమికి వచ్చే ప్రమాదం ఏమీ లేదని, మానవులకు వచ్చే ముప్పు ఏమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. మన వ్యోమగాములకు గానీ, కక్ష్యలో తిరుగుతున్న ఇతర ఉపగ్రహాలకు కానీ ఎలాంటి నష్టమూ లేదని పేర్కొంటున్నారు. అయితే, ఈ ఘటన కారణంగా భవిష్యత్తులో ఇదే చందమామపై బోలెడన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న మానవాళికి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది.
స్పేస్ ఎక్స్ రాకెట్ శకలం మాదిరి ఏవేవో వచ్చి చందమామపై కూలిపోతూ ఉంటే.. అక్కడ ఉన్న సైంటిఫిక్ పరికరాలను ధ్వంసం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 1967లో అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. అంతరిక్షం ప్రపంచ ఉమ్మడి సొత్తు. ఏ దేశం కూడా దీన్ని తమదిగా చెప్పుకునే అవకాశం లేదు. అయితే, ఇందులో చంద్రమామ సహా అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలన్న అంశంపై మార్గదర్శకాలు, నియంత్రణలు లేవు. ఆయా దేశాలు, కంపెనీలదే బాధ్యత.
ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం చందమామపై కుప్పకూలిపోయే రాకెట్ శకలం బాధ్యత స్పేస్ ఎక్స్ కంపెనీ, అమెరికాదే. ఇక్కడే వివాదం మొదలవుతుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చందమామపైకి జరిపే ప్రయోగాలపై ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీ సిద్ధం చేయాలని, ఎవరైనా తప్పు చేస్తే నోటీసులు జారీ చేయాలని, పర్యవేక్షణకు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాలని నిపుణులు కోరుతున్నారు.
