Donald Trump
Gaza deal: జెరూసలెంలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. “ఈ సుదీర్ఘమైన యుద్ధం ముగిసింది.. ఇది ఎన్నడూ చూడని విజయం.
దాదాపు మొత్తం గాజా ప్రాంతాన్ని నిరాయుధీకరించాలి, హమాస్ వద్ద ఆయుధాలు లేకుండా చేయాలన్న ప్రణాళికకు ఆమోదముద్ర పడింది. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు ఉండదు” అని అన్నారు. తాము యుద్ధంలోకి దిగితే, ఎవరూ ఎన్నడూ గెలవలేని రీతిలో గెలుస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మధ్యప్రాచ్యం సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోందని ట్రంప్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ తుపాకుల మోతలు లేవని చెప్పారు. అమెరికాలో ఇప్పుడున్న స్వర్ణయుగం ఇజ్రాయెల్‌లోనూ ప్రారంభమైందని తెలిపారు.
పాలస్తీనియా ప్రజలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ట్రంప్ అన్నారు. 2023 అక్టోబర్ 7న జరిగిన భయంకర ఘటనలను ట్రంప్ గుర్తు చేస్తూ.. ఆ దాడిని అమెరికా ఎప్పుడూ మరవదని చెప్పారు. అటువంటి దాడి మరోసారి జరగవద్దని అన్నారు.
తన అల్లుడు జేర్డ్ కుష్నర్ గాజా కాల్పుల విరమణలో కృషి చేశారని ట్రంప్ చెప్పారు. జేర్డ్ కుష్నర్ గాజా కాల్పుల విరమణలో సహకరించినందుకు ట్రంప్ ప్రశంసలు తెలిపారు. గాజా డీల్‌కు సహకరించినందుకు అరబ్, ముస్లిం దేశాలను ప్రశంసించారు.
మరోవైపు, ప్రతిపక్ష సభ్యులు ట్రంప్ ప్రసంగానికి కాసేపు అంతరాయం కలిగించారు. “మారణహోమం” అంటూ వారు నినాదాలు చేయడంతో.. వారిని పార్లమెంటు నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత ట్రంప్‌నకు స్పీకర్ సారీ చెప్పారు. ట్రంప్ స్పందిస్తూ.. సమర్థవంతంగా పనిచేశారంటూ జోకులు వేశారు.
కాగా, 2023 అక్టోబర్ 7న పాలస్తీనా ఉగ్రవాద గ్రూప్ హమాస్.. ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేసింది. సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మృతి చెందారు. 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. ఈ ఘటనే గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధానికి కారణం.