Israel Hezbollah Ceasefire : లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉందా?
ఈ అగ్రిమెంట్ తో ప్రపంచ యుద్ధ భయం తొలగిపోయినట్లేనా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఈ ఒప్పందం తర్వాత ఏం జరగబోతోంది?

Israel Hezbollah Ceasefire : బాంబు శబ్దాల మధ్య వినిపించని ఆర్తనాదాలు. కన్నీళ్లు ఇంకిపోయిన ప్రాణాలు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధంలో ప్రపంచానికి కనిపించని సన్నివేశాలు ఇవే. రావణకాష్టంలా రగులుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగిపోతూ దిగిపోతూ చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే. ఇక యుద్ధం ఆగినట్లేనా, జస్ట్ బ్రేక్ మాత్రమేనా? ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలకు అర్థం ఏమిటి?
భగ్గుమంటున్న పశ్చిమాసియా కాస్త చల్లారింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చాలావరకు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య 13 నెలల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడినట్లైంది. రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ప్రకటించారు. శాశ్వత కాల్పుల విరమణ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో బలగాలను ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, అటు తమ సరిహద్దులోని భూభూగాన్ని లెబనాన్ సైన్యం నియంత్రణలోకి తీసుకుంటుంది. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ సైన్యంతో ఐక్యరాజ్యసమితి శాంతి బృందాలను మోహరిస్తారు.
ఒకరికి అవసరం. మరొకరికి అవకాశం. కాల్పుల విరమణ ఒప్పందం వెనక కనిపిస్తోంది ఇదే. హెజ్బొల్లా అంతు చూడటమే లక్ష్యం అని ప్రకటించిన ఇజ్రాయెల్.. ఒప్పందానికి అంగీకరించడం వెనక అసలు వేరే ఉందా? నెతన్యాహూ అసలు ప్లాన్ ఏంటి? హెజ్బొల్లా ఎందుకు వెనక్కి తగ్గింది? ఈ అగ్రిమెంట్ తో ప్రపంచ యుద్ధ భయం తొలగిపోయినట్లేనా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఈ ఒప్పందం తర్వాత ఏం జరగబోతోంది?
పశ్చిమాసియా నుంచి ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే భయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఈ ఒప్పందంతో ఆ భయాలు పూర్తిగా తొలగిపోయినట్లు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం వెనక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనేది ఇజ్రాయెల్ వ్యూహం అనే వాదన వినిపిస్తోంది. ప్రపంచ యుద్ధ భయాలు పూర్తిగా తొలగినట్లు కాదు అనేది అందుకే.
Also Read : యుక్రెయిన్‌పై రష్యా మిసైల్ అటాక్.. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా?