SpaceX Starship Project : అమెరికాకు వెళ్లాలంటే దాదాపు 18 గంటలు ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలి. ఇక్కడి నుంచి దుబాయ్ కు, అక్కడి నుంచి అమెరికాకు.. యూఎస్ ప్రయాణం అంటేనే పెద్ద పని. అదే అమెరికాకు ఓ సీరియస్ చూసే టైమ్ లోనే వెళ్లిపోతే.. కేవలం 40 నిమిషాల్లో అక్కడ అడుగుపెడితే.. అంటే అన్నారు కానీ, అసలా ఊహే ఎంతో అందంగా ఉందని అనుకుంటున్నారు కదా. ఇదే నిజం చేస్తానంటున్నారు మస్క్. అమెరికా శాన్ ఫ్రాన్సిస్ కో నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లో జనాలను డ్రాప్ చేస్తానంటున్నారు. ఇంతకీ ఎలా? మస్క్ మాటలు నిజమేనా? అసలది సాధ్యమయ్యే పనేనా?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తన మానస పుత్రిక స్పేస్ ఎక్స్ ను విస్తరించేందుకు ఎలాన్ మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభతరం చేయడం, తక్కువ టైమ్ లో ఎక్కువ దూరం ట్రావెల్ చేసేలా ఓ ప్రాజెక్ట్ ను తీసుకురాబోతున్నారు. దీని గురించే ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది.
అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. ప్రయాణ సమయం తగ్గితే ఎంత బాగుండు అనేది ప్రతీ ఒక్కరి కోరిక. దీన్నే అవకాశంగా మార్చుకోవాలని మస్క్ ఫిక్స్ అయ్యారు. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాలలోపు చేరుకోవచ్చు. మస్క్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
నిజానికి ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ పదేళ్ల కిందటే సూచనలు చేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ ఇది చర్చకు వచ్చింది. ఈ టెక్నాలజీకి సంబంధించి ఎక్స్ లో (ట్విట్టర్) ఓ యూజర్ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇది సాధ్యమే అంటూ మస్క్ రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారా? అనే ఆసక్తి మొదలైంది.
మామూలుగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. అయితే, ఇప్పుడు మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్.. రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధిని 30 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం కూడా, సాధ్యమయ్యే పని. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై పనులు జరుగుతున్నాయి. మరి కొన్నేళ్లలో ఇది జనాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ లో ప్రయాణం చేయాల్సింది విమానంలో కాదు రాకెట్ ద్వారా. రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడ్ తో ఒక్కసారిగా దాదాపు భూ కక్ష్య సరిహద్దుల వరకు వెళ్లి ఆ తర్వాత గమ్యస్థానం వైపునకు దూసుకొస్తుంది. దీంతో ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది.
Also Read : డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో యువ నాయకత్వానికి పెద్దపీట.. బైడెన్, ట్రంప్ టీమ్‌కు తేడాలు ఇవే..