Sri Lanka crisis: యుద్ధ వీరుడి నుంచి విద్రోహం వరకు..శ్రీలంకలో గొటబయ విలన్ ఎలా అయ్యారు ?

గొటబయ రాజపక్స.. పేరు మాత్రమే కాదు.. వీరత్వానికి బ్రాండ్. ఐతే ఇది మొన్నటివరకు మాట. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే మంటలు రాజుకుంటున్నాయ్. పిడికిళ్లు లేస్తున్నాయ్. యుద్ధ వీరుడు కాస్త.. దేశంపాలిట విద్రోహిగా మారారు.

Sri Lanka crisis: గొటబయ రాజపక్ష.. గొప్ప యుద్ధ వీరుడు అంటూ ఎవరైతే ప్రశంసలు గుప్పించారో… వాళ్లే ఇప్పుడు ఛీ కొడుతున్నారు. ఆకలి కేకలకు కారణం అంటూ నిలదీస్తున్నారు. అసలు గొటబయ రాజకీయప్రవేశం ఎలా జరిగింది.. ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదమే ఎందుకు అయింది. LTTEకి పోరాటంలో నిజంగా గొటబయను హీరో అనుకోవాల్సిందేనా.. లేదంటే అసలు మేటర్ వేరే ఉందా.. రాజపక్స ఫ్యామిలీపై లంకేయుల్లో జరుగుతోన్న చర్చ ఏంటి..

గొటబయ రాజపక్స.. పేరు మాత్రమే కాదు.. వీరత్వానికి బ్రాండ్. ఐతే ఇది మొన్నటివరకు మాట. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే మంటలు రాజుకుంటున్నాయ్. పిడికిళ్లు లేస్తున్నాయ్. యుద్ధ వీరుడు కాస్త.. దేశంపాలిట విద్రోహిగా మారారు. శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంతో మూడు దశాబ్దాలు సాగిన యుద్ధానికి తెరదించిన వ్యక్తి గొటబయ. ఓవైపు వివాదాస్పదంగా వ్యవహరిస్తూ విమర్శలు ఎదుర్కొంటూనే… మరోవైపు అత్యంత గౌరవమర్యాదలు పొందిన నాయకుడు. శ్రీలంక జనాభాలో అత్యధికంగా ఉన్న సింహళ బౌద్ధులు.. ఆయనను యుద్ధవీరుడిగా పొగిడితే.. మైనారిటీ తమిళుల దృష్టిలో మాత్రం రాజపక్స నమ్మకూడని వ్యక్తి. ఇప్పుడు అదే నిజం అయింది. దేశం ఆకలి కోరల్లో చిక్కుకున్న వేళ అసలు విషయం బయటపడింది.

శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాలించేవారు లేక.. దేశం అనాధగా మిగిలిపోయింది. పెరిగిపోయిన అప్పులు.. తరిగిపోయిన ఆదాయం… ఎటు చూసినా శూన్యం. శ్రీలంక పరిస్థితి ఇప్పుడు ఇదే ! రాజపక్స చతుష్టయమే.. దేశానికి ఈ పరిస్థితికి కారణం అని లంకేయులు భగ్గుమంటున్నారు. నిరసనలకు దిగుతున్నారు. అధ్యక్ష నివాసాన్ని దిగ్బంధించడంతో.. గొటబయ పరారయ్యాయ. LTTE సంస్థపై యుద్ధంలో విజయం సాధించి వీరుడు.. హీరో అనిపించున్న గొటబయ.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడి.. బంధుప్రీతి, ఆస్తుల మీద వ్యామోహంతో శ్రీలంక పాలిట విలన్‌గా మారాడు. జనాల ఆందోళనకు బతుకు జీవుడా అంటూ పారిపోయాడు.

Sri Lanka crisis : రాజపక్స కుటుంబం రాజకీయ భవిష్యత్ ఏంటి..?

గొటబయ లంకను వదిలి పారిపోయిన వేళ.. ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. మంత్రివర్గం మొత్తం రాజపక్స చేతుల్లోనే ఉండేది. చేసిన ఏ తప్పు బయటకు ఎవరు చెప్పినా.. ఆ మనిషి మళ్లీ కనిపించేవాడు కాదని.. అంతటి కర్కోటకులు రాజపక్స కుటుంబం అని ఓ పేరు ఉంది. LTTE యుద్ధం అని ప్రతీసారి పొగడ్తలు చేసినా.. అందులోనూ గొటబయ వ్యవహారంలో పాత అనుమానాలు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయ్. తమిళుల మరణాలు, తమిళ కుటుంబాలు అదృశ్యం కావటం వంటివి గొటాబయపై అప్పట్లోనే యుద్ధనేరాల ఆరోపణలు వినిపించాయ్. LTTEతో సంగ్రామానికి తెరదించిన యుద్ధవీరుడిగా గొటబయను పొగుడుతారు కానీ.. ఆయన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయ్. యుద్ధ సమయంలో సైనికులు చేసిన లైంగిక హింస, చట్టవిరుద్ధ హత్యలను రాజపక్స సోదరులిద్దరూ చూసిచూడనట్లు వదిలేశారన్న విమర్శలు ఉన్నాయ్.

సేనానాయకే, జయవర్ధనే, బండారనాయకే లాంటి కుటుంబాలు.. ఒకప్పుడు శ్రీలంక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవి. ఐతే రాజపక్స కుటుంబం దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
గత 15ఏళ్లలో రాజపక్ష కుటుంబం చాలా ఎత్తుపల్లాలను చూసింది. ప్రతిసారీ ఎలాగోలా అధికారంలోకి వస్తోంది. ఇక్కడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ కుటుంబ రాజకీయాలకు గట్టి పునాది వేసింది మహింద రాజపక్ష. ఆయన తమ్ముడు గొటబయ… దీన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. 2005లో రాజకీయాల్లోకి వచ్చిన గొటబయ.. అప్పట్లో రక్షణ మంత్రి పదవి దక్కించుకున్నారు. గొటబయ నేతృత్వంలో తమిళ వేర్పాటువాదులపై శ్రీలంక సైన్యం పైచేయి సాధించింది. ఐతే ఎల్‌టీటీఈపై తీసుకున్న సైనిక చర్యలన్నీ వివాదాలమయమే. దీంతో 2015 ఎన్నికల్లో ఓడిపోగా.. 2018లో అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ విజయం సాధించారు.

Sri Lanka Crisis : గొటబాయకు మల్దీవుల్లోనూ నిరసనలు..మాలే నుంచి సింగపూర్ కు వెళ్లే ప్లాన్ లో లంక అధ్యక్షుడు

చైనాకు సానుకూలంగా వ్యవహరించే వ్యక్తిగా గొటబయకు పేరుంది. హంబన్​తోట ఓడరేవు చైనా చేతుల్లోకి వెళ్లడం వెనక గొటబయ ఒకరకంగా కారణం. డ్రాగన్‌కు కొమ్ముకాస్తూ సొంత ఆస్తులు వెనకేసుకుంటూ.. దేశం దివాళా తీసే స్థితికి తీసుకువచ్చారు. జనాలు అంతా ఏకమై దిగిపోవాలని నిరసనలు చేసినా.. అధికార పీఠాన్ని అలాగే పట్టుకూర్చుకున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని పరారయ్యారు. రాజపక్స కుటుంబం పేరు చెప్తేనే ఇప్పుడు జనాలు ఛీ కొడుతున్నారు. శ్రీలంకకు ఈ గతి పట్టించిన ఆ నలుగురిపై జనాలు విసిగిపోయారు. ఐతే రాజపక్సలు తమ పట్టును అంత సులభంగా వదులుకోవటానికి సిద్ధంగా ఉండరు. వారు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే కాదు.. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక తమ భద్రత పరిస్థితి ఏమిటనే దాని గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ కుటుంబం రాజకీయ భవిష్యత్ ఏంటా అన్న చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు