What Is The Political Future Of The Rajapaksa Family
Sri Lanka crisis : రాజపక్స కుటుంబం ఇప్పుడు లంక నుంచి పారిపోయింది.. కాదు కాదు లంకేయులంతా కలిసి వెళ్లగొట్టారు. మరి ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి.. రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.. రాజపక్స కుటుంబాన్ని జనాలు మళ్లీ నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా.. శ్రీలంక రాజకీయం ఎలా ఉండబోతోంది..?
గొటబయ రాజపక్స కుటుంబంతో కలిసి.. మాల్దీవులకు పరారయ్యారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీబ్‌తో.. రాజపక్స కుటుంబానిక మంచి సంబంధాలు ఉన్నాయ్. మహీంద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. లంకలో నషీబ్‌కు ఆశ్రయం కల్పించారు. దీంతో ఇప్పుడు గొటబయ అక్కడికి వెళ్లారు. ఇక శ్రీలంకలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన రాజపక్స సోదరులు… ఇప్పుడు సామాన్యులుగా మారిపోయారు. ఆర్థిక సంక్షోభం కారణంగా.. జనాల్లో వారికి గౌరవం లేకుండా పోయింది. ఒకప్పుడు రైట్ అన్న వాళ్లే ఇప్పుడు వాళ్లను రాంగ్ అంటున్నారు. జనాల కోపాన్ని తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరుగా… మహీంద, గొటబయ ఇళ్లు వదిలి పరారు కావాల్సిన పరిస్థితి ఎదురైంది. రాజకీయానికి కేరాఫ్‌గా మారిన రాజపక్సె కుటుంబానికి.. ఇప్పుడు పొలిటికల్‌గా ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. గొటబయా, మహీందను మాత్రమే కాదు.. రాజపక్స కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా నమ్మే పరిస్థితుల్లో శ్రీలంక జనాలు కనిపించడం లేదు.
Also read : Sri Lanka crisis: యుద్ధ వీరుడి నుంచి విద్రోహం వరకు..శ్రీలంకలో గొటబయ విలన్ ఎలా అయ్యారు ?
2019 నవంబరులో గొటబాయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా అత్యంత శక్తిమంతమైన అధ్యక్షుడిగా అవతరించారు. నిజానికి ఆయనకు జనాల్లో ఆదరణ చాలా తక్కువ. అన్న మహిందకు ఉన్న ఫాలోయింగ్‌తో ఎదిగారు. ప్రస్తుత సంక్షోభంతో ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. దీంతో మళ్లీ అధికారం అనేది అసాధ్యం. ఇక మహీంద కూడా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జనాల్లో ఆయనకు మునుపటి స్థాయిలో ఆకర్షణ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఇద్దరి తమ్ముడు బాసిల్ రాజపక్సకు జనాల్లో అంతలా ఫాలోయింగ్ లేదు. పైగా ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో సంక్షోభం ఏర్పడింది. దీంతో భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఖాయం.
రాజపక్స కుటుంబంలో నాలుగో సోదరుడు చమల్‌కు కూడా.. జనాల్లో అంత సీన్ లేదు. ఇక మహీంద కుమారుడు నమల్ కూడా లంక కేబినెట్‌లో ఉన్నారు. ఐతే ఇప్పటివరకు రాజకీయాల్లో పెద్దగా నిరూపించుకోలేదు. తమ కుటుంబం పాలనలోనే దేశం ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకోవడం.. అతని రాజకీయ భవిష్యత్‌ను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఇలా ఇప్పుడు రాజపక్స కుటుంబానికి పొలిటికల్‌గా ఎండ్ కార్డు పడినట్లే కనిపిస్తోంది. కొద్దిరోజుల ముందువరకు రాజపక్స కుటుంబానికి చెందిన 18మంది లంక రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఐతే ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న నిరసనలు.. వారి భవిష్యత్‌పై ప్రభావం చూపించబోతున్నాయ్.
Also read : Sri Lanka Crisis : గొటబాయకు మల్దీవుల్లోనూ నిరసనలు..మాలే నుంచి సింగపూర్ కు వెళ్లే ప్లాన్ లో లంక అధ్యక్షుడు
రాజపక్స కుటుబంలోనూ ఎవరూ.. కనీసం కనిపించేందుకు కూడా ఇష్టపడడం లేదు. తమిళ వేర్పాటువాదులపై విజయం సాధించడంతో.. సింహళ జనాల దృష్టిలో రాజపక్ష కుటుంబం హీరోగా మారింది. ఐతే ఇప్పుడు అదే కుటుంబాన్ని జనం విలన్‌గా చూస్తున్నారు. ముఖ్యంగా గొటబయ విషయం ఆ కోపం స్పష్టంగా కనిపిస్తోంది. లంక రాజకీయాల్లో ఏళ్లపాటు రాజపక్ష కుటుంబం చక్రం తిప్పిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ఈ కుటుంబం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆర్థిక సంక్షోభంతో జనాల ఆగ్రహం మొత్తం రాజపక్స కుటుంబంవైపు మళ్లింది. ఈ కుటుంబం రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఊహించడం కూడా కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.