Sri lanka crisis: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ఔట్? ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు..

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు అర్థాకలితో...

Sri lanka crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు అర్థాకలితో జీవనం గడుపుతున్నారు. దేశ అధ్యక్షుడు గొటబాయ, ప్రధాన మంత్రి మహింద రాజపక్సలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంతటి ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పటికే అధికార కూటమి నుంచి పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో రాజపక్స కుటుంబీకులు కూడా ఉన్నారు. ప్రధానిగా మహింద రాజపక్స, అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సే కొనసాగుతున్నారు. వీరువురు రాజీనామా చేయాల్సిందే అంటూ ఆ దేశంలో ప్రజా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

Sri lanka crisis: నేను రాజీనామా చెయ్య.. శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం..
ఈ క్రమంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన సోదరుడయిన మహింద రాజపక్సను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలంటూ సూచించినట్లు తెలిసింది. కానీ మహింద అందుకు ససేమీరా అంటుండటంతో శుక్రవారం అధ్యక్షుడు గొటబాయ అధికార శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ) కూటమిని వీడిన అసమ్మతి గ్రూపు సభ్యులు, వివిధ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టి, మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా వారికి అధ్యక్షుడు సూచించినట్లు తెలిసింది. మాజీ అధ్యక్షుడు, మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) ప్రతినిధి బృందం కూడా ఈ భేటీలో పాల్గొంది. ఈ సందర్భంగా మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టేందుకుగానూ కీలక మార్పులకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని, ఇందులోభాగంగా నూతన ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటుతో పాటు, అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

Sri lanka crisis : శ్రీలంకలో ప్రజా ఆందోళనలు ఉధృతం.. రోడ్లపైకొచ్చి మద్దతు తెలిపిన క్రికెటర్స్

ప్రధాని మహిందా రాజపక్సేను తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు గొటబాయ అంగీకరించినట్లు సిరిసేన తెలిపారు. 225 మంది సభ్యులుండే శ్రీలంక పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏకాభిప్రాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్స ఆ పదవి నుంచి వైదొలగాల్సిందేనని అధికార కూటమిలోని అసమ్మతి వర్గం డిమాండ్‌ చేసింది. దీంతో ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స తప్పుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా మహింద కూడా ప్రధాని పదవి వీడితే శ్రీలంక ప్రభుత్వంలో రాజపక్స కుటుంబంలో అధ్యక్షుడు గొటబాయ మినహా మొత్తం దూరమైనట్లే.

ట్రెండింగ్ వార్తలు