‘ఈస్టర్ డే’ రోజు జరిగిన ఘోరానికి లంక దేశం అతలాకుతలం అయింది. వరుస బాంబు పేలుళ్ల అనంతరం గందరగోళానికి గురైన దేశానికి రక్షణ కల్పించే ఉద్ధేశ్యంతో శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
ఆదివారం రోజు జరిగిన ప్రమాదంలో 290 మంది చనిపోగా, 500మంది గాయాలకు గురైయ్యారు. ఉగ్రదాడిగా భావించిన ప్రభుత్వం.. మరిన్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది.
నేరస్థులను పట్టుకునే క్రమంలో ఆదివారం రాత్రి దాడులు జరిపి 24 మందిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన విదేశీ పర్యటనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సోమవారం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ లంక ప్రధానమంత్రి రానిల్ విక్రెమెసింగె కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.