×
Ad

Mexico Earthquake : అమ్మో భూకంపం.. మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. పరుగులు పెట్టిన ప్రజలు.. వీడియోలు వైరల్..

Mexico Earthquake : భూకంపం తీవ్రత ఎక్కువగా మెక్సికో సిటీ, అకాపుల్కో నగరాల్లో కనిపించింది. భూకంపం హెచ్చరిక సైరన్లు మోగడంతో లక్షల మంది ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

Mexico Earthquake

  • మెక్సికోలో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదు
  • పలు ప్రాంతాల్లో కుప్పకూలిన భవనాలు
  • ఇద్దరు మృతి చెందినట్లు వెల్లడించిన అధికారులు

Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పసిఫిక్ తీరంలో శాన్‌మాక్రోస్ పట్టణానికి సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. దీని వల్ల ఏకంగా 33 సెకన్ల పాటు భూమి కంపించింది.

Also Read : ISIS: అమెరికాలో కలకలం.. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రదాడికి యత్నం..! FBI సంచలన ప్రకటన

భూకంపం తీవ్రత ఎక్కువగా మెక్సికో సిటీ, అకాపుల్కో నగరాల్లో కనిపించింది. భూకంపం హెచ్చరిక సైరన్లు మోగడంతో లక్షల మంది ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికో సిటీలో ప్రజలు భూకంపం కారణంగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం సైరన్ మోగగానే ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు.


భూకంపం కారణంగా గెరెరో రాష్ట్రం చుట్టూ ఉన్న పలు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా గెరెరో రాష్ట్రంలో ఇల్లు కూలిపోవడంతో 50ఏళ్ల మహిళ మరణించింది. మెక్సికో నగరంలో 67ఏళ్ల వ్యక్తి తన అపార్టుమెంట్ భవనం నుంచి కిందకు వస్తున్న క్రమంలో కిందపడి మరణించాడని స్థానిక మీడియా తెలిపింది. భారీ భూకంపం కారణంగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులకు నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేదని విమానయాన సంస్థ తెలిపింది.


మెక్సికో సిటీలో ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెతోపాటు మీడియా సిబ్బందిని నేషనల్ ప్యాలెస్ నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. మరోవైపు భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.


మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు. గెరెరో రాష్ట్ర గవర్నర్ తో మాట్లాడానని.. రాజధాని మెక్సికో నగరంలో ఎటువంటి నష్టం జరగలేదని ఆమె పేర్కొన్నారు.