ISIS: అమెరికాలో కలకలం.. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రదాడికి యత్నం..! FBI సంచలన ప్రకటన
కత్తులు, సుత్తులు ఉపయోగించి దాడి చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ( Christian Sturdivant)
ISIS Representative Image (Image Credit To Original Source)
- అమెరికాలో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రదాడికి యత్నం
- ముందే పసిగట్టిన ఎఫ్బీఐ
- 18 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు
ISIS: అమెరికా ఎఫ్బీఐ సంచలన ప్రకటన చేసింది. అమెరికాలో న్యూఇయర్ వేడుకల వేళ ఐసిస్ ప్రేరేపిత దాడి కుట్రను భగ్నం చేసినట్లు ప్రకటించింది. దాడికి కుట్ర చేసిన 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశామంది. నిందితుడిని క్రిస్టియన్ స్టర్డివెంట్ గా గుర్తించారు. కొన్ని నెలల పాటు దర్యాప్తు జరిపి.. నూతన సంవత్సర వేడుకల ముందు రోజున అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి హాని జరగకముందే ఈ కుట్రను భగ్నం చేశామని అధికారులు తెలిపారు.
2022 నుండి FBI రాడార్‌లో..
FBI ప్రకారం స్టర్డివెంట్ మైనర్‌గా ఉన్నప్పటి (2022) నుండి ఎఫ్బీఐ రాడార్‌లో ఉన్నాడు. విదేశాల్లో ఉన్న ISIS సభ్యుడితో అతడు సంబంధాలు కలిగి ఉన్నాడని, నల్లటి దుస్తులు ధరించి సుత్తితో దాడులు చేయమని సూచనలు అందుకున్నాడని అధికారులు తెలిపారు. “FBI, లా ఎన్ ఫోర్స్ మెంట్ పార్టనర్స్ నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉగ్రవాద దాడిని అడ్డుకున్నారు. అతడు ISIS నుండి ప్రేరణ పొందాడు” అని FBI ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ దీనిపై స్పందించారు. “మాతో కలిసి పనిచేసి, నిస్సందేహంగా ప్రాణాలను కాపాడిన మా గొప్ప భాగస్వాములకు ధన్యవాదాలు” అని అన్నారు.
కత్తులు సుత్తులతో దాడికి ప్లాన్..
కత్తులు, సుత్తులు ఉపయోగించి దాడి చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. కోర్టు పత్రాల ప్రకారం, స్టర్డివాంట్ తన ఉద్దేశాలను ఆన్‌లైన్‌లో ఉగ్రవాదులుగా నటిస్తున్న రహస్య అధికారులతో చర్చించాడు. ఆ యువకుడు దాదాపు ఒక సంవత్సరం పాటు దాడిని ప్లాన్ చేస్తున్నాడని యుఎస్ అటార్నీ రస్ ఫెర్గూసన్ తెలిపారు. అతను జిహాద్‌కు సిద్ధమవుతున్నాడని వెల్లడించాడు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడికి ప్రణాళిక రచించినట్లు స్టర్డివాంట్ ఒక రహస్య అధికారికి చెప్పాడని దర్యాఫ్తు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 29న అధికారులు స్టర్డివెంట్ ఇంట్లో సోదాల కోసం వారెంట్ జారీ చేశారు. ఇంట్లో సోదాలు జరపగా చేతితో రాసిన కొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో “న్యూ ఇయర్స్ అటాక్ 2026” అనే శీర్షికతో ఉన్న ఒక నోటులో చొక్కా, ముసుగు, కత్తులు, ఇతర వస్తువుల జాబితా ఉంది. పోలీసుల చేతిలో చనిపోయే ముందు చాలా మందిని కత్తితో పొడిచి చంపే ప్రణాళికలు కూడా అందులో వివరించబడ్డాయి.
తాను ISIS సభ్యులతో మాట్లాడుతున్నానని స్టర్డివాంట్ నమ్మాడు. కానీ, నిజానికి అతడు రహస్య అధికారులతో మాట్లాడాడు. అది గుర్తించలేకపోయాడు.
విదేశీ ఉగ్రవాద సంస్థకు మద్దతు అందించడానికి ప్రయత్నించాడని స్టర్డివాంట్ పై అభియోగాలు ఉన్నాయి. అతను షార్లెట్‌లో మొదటిసారి కోర్టుకు హాజరయ్యాడు. ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు.
ఇస్టామిక్ స్టేట్ పై ప్రశంసలు..
కోర్టుకు సమర్పించిన FBI అఫిడవిట్ ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్‌ను ప్రశంసిస్తూ నిందితుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీని గురించి సమాచారం అందిన వెంటనే గత నెలలో దర్యాప్తు ప్రారంభమైంది. ఆ పోస్టుల ఖాతా స్టర్డివాంట్‌తో ముడిపడి ఉందని అధికారుల విచారణలో బయటపడింది.
స్టర్డివెంట్ మైనర్‌గా ఉన్నప్పుడే దర్యాప్తు అధికారులు అతడిపై ఫోకస్ చేశారని దాఖలు పత్రంలో పేర్కొన్నారు. ఆ సమయంలో, అతను ఐరోపాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థతో మాట్లాడినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆ సంస్థ అతనికి నల్లటి దుస్తులు ధరించి, సుత్తిని ఉపయోగించి దాడులు చేయమని సలహా ఇచ్చిందన్న ఆరోపణలున్నాయి.
Also Read: జనాభాను పెంచుకునేందుకు చైనా ప్లాన్.. కొత్తగా ఏమేం అమలవుతున్నాయంటే?
