China: జనాభాను పెంచుకునేందుకు చైనా ప్లాన్.. కొత్తగా ఏమేం అమలవుతున్నాయంటే?
చైనా జనాభాలో వృద్ధులు పెరిగిపోవడం, మందగించిన ఆర్థిక పరిస్థితుల మధ్య బీజింగ్ యువతను వివాహానికి ప్రోత్సహించేందుకు, దంపతులు పిల్లలు కనాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తోంది.
China Infant (Image Credit To Original Source)
- గర్భనిరోధక వస్తువులపై 13% అమ్మకపు పన్ను
- శిశు సంరక్షణ సేవలకు పన్ను మినహాయింపు
- 1994 నుంచి అమల్లో ఉన్న ట్యాక్స్ మినహాయింపులు తొలగింపు
China: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత జనాభా భారాన్ని ఎదుర్కొన్న చైనా ఒకప్పుడు “ఒక బిడ్డే ముందు.. రెండో బిడ్డ వద్దు” అనే సూత్రాన్ని పాటించింది. 1979 నుంచి 2015 వరకు చైనా ప్రభుత్వం “ఒక బిడ్డ విధానం”ను అమలు చేసింది.
చైనా పౌరులపై చట్టబద్ధంగా దీన్ని వర్తింపజేశారు. ప్రభుత్వ నియంత్రణలు, జరిమానాలు, ఉద్యోగ పరిమితుల ద్వారా చాలా కుటుంబాలు ఒకే బిడ్డకు పరిమితమయ్యేలా చేసింది. 2016 తరువాత ఆ విధానాన్ని సడలించారు.
ఇప్పుడు మాత్రం చైనాలో సీన్ రివర్స్ అయింది. జనాభాను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. జనన రేట్లను పెంచే ప్రయత్నంలో భాగంగా నేటి నుంచి గర్భనిరోధక వస్తువులపై 13% అమ్మకపు పన్ను విధించనుంది. శిశు సంరక్షణ సేవలకు పన్ను మినహాయింపు ఇస్తోంది.
“పన్ను వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ” అమలు నేటి నుంచే..
గత ఏడాది చివరలో ప్రకటించిన పన్ను వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 1994 నుంచి అమల్లో ఉన్న అనేక ట్యాక్స్ మినహాయింపులు నేటి నుంచి తొలగిపోతాయి.
వివాహానికి సంబంధించిన సేవలు, వృద్ధుల సంరక్షణ సేవలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వ్యాట్ అంటే వస్తువులు సేవలపై విధించే విలువ ఆధారిత పన్ను. తల్లిదండ్రుల సెలవులు పొడిగింపు, నగదు ప్రోత్సాహకాలు వంటి వాటిల్లో ఇది భాగంగా ఉంటుంది.
చైనా జనాభాలో వృద్ధులు పెరిగిపోవడం, మందగించిన ఆర్థిక పరిస్థితుల మధ్య బీజింగ్ యువతను వివాహానికి ప్రోత్సహించేందుకు, దంపతులు పిల్లలు కనాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తోంది.
అధికారిక గణాంకాల ప్రకారం చైనా జనాభా వరుసగా మూడు సంవత్సరాలుగా తగ్గుతోంది. 2024లో కేవలం 9.54 మిలియన్ శిశువులు మాత్రమే జన్మించారు. ఇది దశాబ్దం క్రితం నమోదైన జననాల సంఖ్యకు సగం స్థాయిలో ఉంది. దశాబ్దం క్రితం పిల్లల సంఖ్యపై ఆంక్షలు సడలించడం ప్రారంభమైంది.
కండోంలు, జనన నియంత్రణ మాత్రలు, పరికరాలు వంటి గర్భనిరోధక వస్తువులపై పన్ను విధింపు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, అనవసర గర్భధారణలు, హెచ్‌ఐవీ రేట్ల సంగతి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
