డోంట్ వర్రీ : కనువిందుగా సూపర్ బ్లడ్ మూన్

హైదరాబాద్ : ఆకాశంలో మరో అద్భుతం (సూపర్ మూన్). కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించే ఈ చంద్రగ్రహణం మూడు గంటలు కనివిందు చేసింది. 2019, 20 సంవత్సరాల్లో కనివిందుచేసే ఏకైక సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. చంద్రుడు భూమికి దగ్గరగా రావటంతో సూపర్ మూన్ (బ్లడ్ మూన్)గా కనిపిస్తాడని తెలిపారు. కొంతమంది మాత్రం ఈ సూపర్ మూన్ వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుందనీ.. భూమి అంతం అయిపోతుందని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ పుకార్లేనని భయపడాల్సిన పనిలేదనీ.. ఖగోళంలో ఇవన్నీ సర్వసాధారణమేనని స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
2019లో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన ఈ గ్రహణాన్ని ‘సూపర్ బ్లడ్ వూల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’గా పిలుస్తున్నారు. ఈ గ్రహణ వివిధ దేశాల కాలమానాల ప్రకారం జనవరి 20, 21 తేదీల్లో కనిపించనుంది. ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందని సైంటిస్టులు తెలిపారు. ఈ సూపర్ మూన్ భారత్ లో కనిపించదు. గ్రహణానికి సంబంధించిన జాగ్రత్తలేవీ భారతీయలు తీసుకోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
హిందూ శాస్త్రాల్లో చంద్రగ్రహణం..నియమాలు :
హిందూ శాస్త్రాల్లో చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణం రోజున కచ్చితంగా నియమాలు పాటిస్తుంటారు. ఆహారం తినకూడదనీ.. కొన్ని రాశులు, నక్షత్రాల వారు (హిందూ శాస్త్రాల ప్రకారం) గ్రహణం చూడకూడదని చెబుతుంటారు. గర్భిణీలు చూడకూడదు సరికదా.. కదలకుండా పడుకోవాలనీ చెబుతుంటారు. గ్రహణం విడిచిన తర్వాత దేవాలయాలు, ఇళ్లను శుభ్రం చేసుకుంటారు.
చంద్రగ్రహణం ఏర్పడుతుందని తెలుసుకోవడం తప్ప మనం (భారతదేశంలో) గ్రహణాన్ని చూడలేం. దీంతో గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే భయాన్ని పెట్టుకోవద్దు అంటున్నారు పండితులు. గర్భిణీలు ఈ చంద్రగ్రహణం గురించి అస్సలు భయపడాల్సిన పనిలేదని స్పెషలిస్టులు చెబుతున్నారు.