Sikhs (2)
Taliban: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలకు దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రాణాలకు తెగించి వారంతా కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు, పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ సహా అనేక దేశాలు తమ ప్రజలను, ఉద్యోగులను సురక్షితంగా స్వదేశాలకు తీసుకెళ్తున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దేశం విడిచి వెళ్లేందుకు అప్ఘాన్లు చేస్తున్న ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అఫ్ఘాన్ ప్రజలు, చిక్కుకుపోయిన విదేశీయులు క్షణమొక యుగంగా గడుపుతుండగా.. ఏ మాత్రం అవకాశం దొరికినా దేశం విడిచి వెళ్లిపోవడానికి కట్టుబట్టలతో, పిల్లాపాపలతో పరిగెత్తుతున్నారు. ఈక్రమంలోనే ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న కొందరు అఫ్ఘాన్ సిక్కులు, హిందువులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ఎక్కకుండా 72 మంది అఫ్ఘాన్ సిక్కులు, హిందువులను తాలిబన్లు అడ్డుకొన్నారు. వారందరినీ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కు పంపేశారు.
దేశం విడిచి వెళ్లేందుకు వీళ్లేదంటూ ఆదేశించారు. అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులను రప్పించడానికి చర్యలు తీసుకొంటామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చినా అక్కడి తాలిబాన్లు మాత్రం వారిని వదిలేందుకు ఒప్పుకోవట్లేదు. తమను అఫ్గాన్ నుంచి తీసుకెళ్లాని సిక్కులు, హిందువులు మాత్రం భారత్, కెనడాలను ప్రాదేయపడుతున్నారు.
మరోవైపు అఫ్ఘానిస్థాన్ జైళ్లలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను తాలిబన్లు వదిలేస్తున్నారు. తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కు చెందిన 100 మందికిపైగా ఉగ్రవాదులను తాలిబన్లు జైళ్ల నుంచి పంపేశారు.