ప్రపంచంలో ఎప్పుడూ జరగనిది, జరగదు అనుకునేది జరిగితే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్ రాజధాని టోక్యోలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఐదు నెలలకే తల్లి గర్భం నుండి బయటపడిన శిశువు అనూహ్యంగా బ్రతికిపోయింది. అయిదు నెలల క్రితం పుట్టిన ఓ చిన్నారి అప్పట్లో అమ్మానాన్నల దోసిట్లో పట్టేంత మాత్రమే ఉన్నాడు. పుట్టినప్పుడు కేవలం 268 గ్రాముల బరువుతో పుట్టి ప్రపంచంలోని అతి చిన్న బాలుడిగా రికార్డుకెక్కిన శిశువు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అవరోధాలను అధిగమించి 3,238 గ్రాముల బరువుకు పెరిగి క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యి ఇంటికి వెళ్లాడు.
టోక్యోలోని కీయో యూనివర్శిటీ ప్రకటన ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ బరువు ఉన్న శిశువు గతేడాది ఆగస్ట్ లో పుట్టాడు. తల్లి 24 వారాల గర్భంతో ఉన్న సమయంలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆ సమయంలో అతని బరువును గమనించిన వైద్యులు ఆ శిశువు బతికి బట్టకడతాడని ఊహించలేదు. అయితే సుమారు 7 నెలల పాటు రకరకాల చికిత్సలు, ఆపరేషన్లు చేసిను డాక్టర్లు ఎట్టకేలకు బాలుడిని బతికించారు. సాధారణంగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టే శిశువుల్లో అవయవాలు సరిగ్గా ఏర్పడని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అంటు వ్యాధులు లాంటి సమస్యలతో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులంటున్నారు. అయితే ఈ శిశువుది గట్టిపిండమే అని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.