Telugu Student Incident In USA : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..! ఆ భయమే కారణమా?

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి ట్రంప్ రాకతో దయనీయంగా తయారైంది.

Telugu Student Incident In USA : అమెరికాలో తెలుగు విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో కొందరు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణకు చెందిన విద్యార్థి యూఎస్ లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆ విషాద ఘటన మరువక ముందే.. మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ జాబ్..
మృతుడిని తుమ్మేటి సాయికుమార్‌రెడ్డిగా గుర్తించారు. న్యూయార్క్‌లోని తన రూమ్‌లో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయ్యర్ స్టడీస్ కోసమని సాయికుమార్ అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ జాబ్ చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సాయికుమార్‌ బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. సాయికుమార్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read : కాళ్లు, చేతులకు సంకెళ్లతోనే టాయిలెట్ వెళ్లాం.. అలానే తిన్నాం.. 51 గంటలు నరకయాతన.. కైతాల్ యువకుడి కన్నీటి వ్యథ..!

ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయికుమార్‌ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారని, ఆందోళనకు గురైన అతడు ఇంటికి వెళ్లలేనేమోనన్న భయంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కారులో విద్యార్థి మృతదేహం..
కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ(25) అనే విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. వంశీ కాంకోర్డియా సెయింట్‌ పాల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఓ కారులో అతడి మృతదేహం కనిపించింది.

ట్రంప్ రాకతో దయనీయ పరిస్థితులు..
కాగా, యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాక.. అక్రమ వలసదారుల పట్ల తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారికి సంకెళ్లు వేసి మరీ వారి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో తెలుగు విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

Also Read : అదానీ కొడుకు పెళ్లికి జస్ట్ రూ.10 లక్షలే ఖర్చు..

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఎడ్యుకేషన్‌ కోసం తీసుకున్న లోన్లు చెల్లించేందుకు డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేసే అంశం.