US President Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ విద్యార్థులు ఇతర దేశాలవైపు మళ్లుతున్నారు.
చైనాలో అమెరికా వీసా ఇంటర్వ్యూలకు అధిక సమయం పడుతోంది. దీంతో కొందరు విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలన్న ఆశను వదులుకుంటున్నారు. అలాగే, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల నుంచి హాంకాంగ్‌లోని యూనివర్సిటీలకు బదిలీ కోసం ఎంక్వైరీలు వస్తున్నాయి. బ్రిటన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలకు కూడా అంతర్జాతీయ అప్లికేషన్లు పెరిగాయి.
అమెరికా కాలేజీలు అంతర్జాతీయ విద్యార్థుల మీద ఆధారపడటాన్ని తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి చేస్తోంది. వలసలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేసి, విదేశీ విద్యార్థులపై నిఘా పెంచింది.
పాలస్తీనాకు మద్దతు తెలిపే నిరసనలలో పాల్గొన్న విద్యార్థులను బహిష్కరించాలని అమెరికా ప్రభుత్వం భావించింది. వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల లీగల్ స్టేటస్‌ని (చట్టపరమైన హోదా) అకస్మాత్తుగా రద్దు చేసింది.
దీనిలో ట్రాఫిక్ ఉల్లంఘన (ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ కట్టడం)కు పాల్పడ్డవారు కూడా ఉన్నారు. అంటే ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన చిన్న నేరానికిగానూ అంతర్జాతీయ విద్యార్థుల లీగల్ స్టేటస్‌ని రద్దు చేస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. కొత్త విద్యార్థుల వీసా అపాయింట్‌మెంట్‌లను అమెరికా అధికారులు నిలిపివేశారు. అప్లికేషన్లను పరిశీలించడానికి సోషల్ మీడియా అకౌంట్లను స్ర్కీనింగ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.
చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇతర దేశాలలోని విద్యా సంస్థలవైపు విద్యార్థులు మళ్లుతున్నారు. దీంతో అమెరికా యూనివర్సిటీల మీద, వాటి ఆర్థిక వ్యవస్థ మీద బాగా ప్రభావం పడవచ్చు.
NAFSA అనే అంతర్జాతీయ విద్యా సంస్థ వీసా, అడ్మిషన్ల డేటాను పరిశీలించి, అమెరికాలో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 30% నుంచి 40% వరకు తగ్గవచ్చని అంచనా వేసింది.
ఈ విశ్లేషణ ప్రకారం.. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు మొత్తం ఫీజు చెల్లిస్తారు, కాబట్టి వారు లేకపోతే కాలేజీ బడ్జెట్‌లను కూడా దెబ్బతీస్తుంది.
అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా తర్వాత బ్రిటన్‌కు వెళ్లడానికి బాగా ఆసక్తి చూపుతారు. బ్రిటన్ ప్రభుత్వం వలసలను తగ్గించాలని, పోస్ట్-స్టడీ వీసాలపై సమయ పరిమితులను విధించింది. గ్రాడ్యుయేట్లు అక్కడ ఉండి పని చేయడానికి వీలు కల్పించింది.
Also Read: ట్రంప్ టారిఫ్ విధించిన వేళ.. అమెరికాకు షాక్ ఇచ్చేలా భారత్ కీలక నిర్ణయం
బ్రిటన్, హాంకాంగ్, సింగపూర్‌కు విద్యార్థులు
ఈ సంవత్సరం బ్రిటన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం అంతర్జాతీయ అప్లికేషన్లు 2.2% పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. చైనా నుంచి రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. అవి గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరిగాయి. అమెరికా నుంచి అప్లికేషన్లు కూడా 8,000కు చేరుకున్నాయి. ఇది 14% పెరుగుదల, 20 సంవత్సరాలలో అత్యధికం.
ఇల్లుమ్ స్టూడెంట్ అడ్వైజరీ సర్వీసెస్ సీఈవో మైక్ హెన్నిగర్ మాట్లాడుతూ.. “అమెరికన్ బ్రాండ్ భారీగా దెబ్బతింది, దానివల్ల బ్రిటన్ లాభం పొందుతోంది” అని చెప్పారు.
హాంకాంగ్, సింగపూర్, మలేషియాలలో యూనివర్సిటీ సీట్ల కోసం చైనా విద్యార్థుల నుంచి డిమాండ్ వేగంగా పెరిగిందని హాంకాంగ్ లోని ఏఏఎస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ విల్ క్వాంగ్ చెప్పారు. చాలా పాశ్చాత్య యూనివర్సిటీలు అక్కడ ఆఫ్ షోర్ క్యాంపస్‌లు నడుపుతున్నాయి.
“కోవిడ్-19 తగ్గిన తర్వాత ఆసియాలో చదువుకోవడం ఒక ట్రెండ్ అయింది. అయితే ఇది అమెరికా అడ్మినిస్ట్రేషన్ మార్పుతో మరింత పెరిగింది” అని క్వాంగ్ చెప్పారు.