Modi, Trump (Image Credit To Original Source)
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో యుక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌పై సుంకాలు విధించారు. ఇప్పుడు ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.
అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అమెరికా అంబాసిడర్-డిజిగ్నేట్ సెర్జియో గోర్ ప్రశంసలు గుప్పించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉంది ఇరాన్. ఇప్పుడు ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25% కొత్త సుంకాలు విధించారు ట్రంప్.
ఈ నిర్ణయం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్‌కు ప్రధాన ఐదు వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటి. ఇప్పటికే భారత్‌పై అమెరికా 50% సుంకాలను విధిస్తోంది. ఇప్పుడు టారిఫ్‌లపై కొత్తగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ చెల్లించే సుంకాలు 75% వరకు పెరిగే పరిస్థితి ఏర్పడింది. అమెరికా దిగుమతి చేసుకునే భారత వస్తువులపై ఈ సుంకాలు ఉంటాయి.
ఇరాన్‌తో భారత్‌కు దీర్ఘకాలిక వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇంధన దిగుమతులు, చాబహార్ పోర్టు అభివృద్ధి ఇందులో భాగం.
Also Read: Sankranthi 2026: సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఎందుకు చేయాలి?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఆందోళనకారులు భద్రతా బలగాల నుంచి హింసను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య చేపడుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం
ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా అయినప్పటికీ, ట్రంప్ నిర్ణయం చైనా కంటే భారత్‌పై అధిక ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా అధికారులు మరో దశ చర్చలకు సిద్ధమవుతున్న వేళ ట్రంప్ ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధించడం గమనార్హం.
వాణిజ్య ఒప్పందంలో అమెరికా నిబంధనలకు భారత్ అంగీకరించాలనే ఒత్తిడే వ్యూహంగా ఈ తాజా సుంకాలను విధించారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. తన మాట వినని దేశాలే లక్ష్యంగా ట్రంప్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచంలోనే ఏ దేశంపైనా లేని విధంగా భారత్‌పై ఇప్పటికే 50% సుంకాలు అమలులో ఉన్నాయని, అవి సరిపోక ఇప్పుడు మొత్తం 75% వరకు పెంచుతున్నారా? అని అమెరికా మాజీ ఉప సహాయ విదేశాంగ కార్యదర్శి ఇవాన్ ఎ ఫీగెన్‌బామ్ ప్రశ్నించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024-2025లో భారత్ ఇరాన్ మధ్య జరిగిన మొత్తం వాణిజ్యం 1.68 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్ ఎగుమతులు 1.24 బిలియన్ డాలర్లు, దిగుమతులు 440 మిలియన్ డాలర్లు. 2019లో ట్రంప్ ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ చమురు దిగుమతులు నిలిపివేసిన తర్వాత నుంచి, రెండు దేశాల వాణిజ్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారత్-ఇరాన్ వాణిజ్యం 2019 తర్వాత 87% తగ్గి, 2019లో 17.6 బిలియన్ డాలర్ల నుంచి 2024లో 2.3 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ రంగాలకు నష్టాలు!
ఇరాన్‌కు భారత్ ప్రధానంగా సేంద్రీయ రసాయనాలు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. భారత బాస్మతి బియ్యానికి ఇరాన్ ముఖ్య విదేశీ మార్కెట్‌గా ఉంది. కొత్త సుంకాలు ఈ ఎగుమతులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఇరాన్ నుంచి భారత్ మెథనాల్, పెట్రోలియం బిటుమెన్, ద్రవీకృత ప్రొపేన్, యాపిల్స్, ఖర్జూరాలు, రసాయనాలు దిగుమతి చేసుకుంటోంది.
అమెరికా సుంకాలు దీర్ఘకాలం అమలైతే.. భారత కంపెనీలు ఇరాన్‌తో లావాదేవీలు తగ్గించుకునే పరిస్థితి తలెత్తవచ్చు. దీని ప్రభావం రసాయనాలు, వ్యవసాయం, ఔషధ రంగాల ఎగుమతులపై పడే అవకాశం ఉంది.
చాబహార్ పోర్టుపై ప్రభావం ఉంటుందా?
భారత్-ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్టు కీలక అంశం. ఇక్కడ భారత్ షాహిద్ బెహెష్టి టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం అమెరికా సుంకాలు ఈ పోర్టు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
గత సంవత్సరం, చాబహార్ పోర్టుకు సంబంధించి అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు 6 నెలల మినహాయింపు లభించింది. అది ఏప్రిల్ 29తో ముగుస్తుంది.
ఈ లోతైన సముద్ర పోర్టుకు భారీ నౌకల నిర్వహణా సామర్థ్యం ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ పక్కన, హార్ముజ్ సముద్ర మార్గం ముఖద్వారంలో ఇది ఉంది. మధ్యప్రాచ్యాన్ని ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లతో అనుసంధానించే కీలక రవాణా మార్గం ఇది.
అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు భారత ప్రవేశ ద్వారంగా చాబహార్ పోర్ట్ పనిచేస్తుంది. పాకిస్థాన్ భూభాగం గుండా వెళ్లకుండా వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేయడంలో ఇండియాది కీలక పాత్ర.