Sankranthi 2026: సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఎందుకు చేయాలి?
మరణించిన తండ్రి, తాత వాళ్ల పేరుతో ఓ రెండు విస్తరాకులు పరిచి, వండిన పదార్థాలని అందులో నివేదన చేసి పెట్టుకోవాలి. వాళ్ల ఫొటోల ముందు పెట్టాలి. వాళ్ల పేరుతో బట్టలు దానం చేయాలి. బొమ్మలు పెట్టే అలవాటు ఉన్నవాళ్లు బొమ్మలు పెట్టుకుని.. బొమ్మలకి హారతి ఇవ్వచ్చు.
Sankranthi (Image Credit To Original Source)
- సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు
- ఉత్తరాయణం పుణ్యకాలం.. దేవతలే నిద్ర లేస్తారు
- స్తోత్రం, ప్రదక్షిణం, నమస్కారం మనల్ని కాపాడతాయి
Sankranthi 2026: భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేశాయి. నిజానికి పండగ అంటే దాని అర్థం.. ఏదో పిండి వంటలు చేసుకుని తినడం, కొత్త బట్టలు కట్టుకోవడం మాత్రమే కాదు. దాని యదార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే.. ఇంత పవిత్ర హృదయంతో ఈ పండుగలను పెట్టారా అనిపిస్తుంది.
భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే.. భోగం అనుభవించే రోజు. ఈ రుతువులో సాధారణంగా.. పౌష్య మాసంలో ఈ పౌష్య లక్ష్మి ఇంటికి వస్తుంది. పూర్వం ఇన్ని రకాలైన ఉద్యోగాలు లేవు.. చాలామంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఆరుగాలం కష్టపడిన వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో సంతోషాన్ని పొందుతాడు. పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకుని, మానసికమైన ఆనందాన్ని పొందడానికి వెళతాడు. అందుకే ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం.
దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. ఎప్పుడైనా సరే పండగకి తిధి ఉంటుంది. కానీ, భోగి ఎప్పుడూ ఏ తిధినాడూ ఉండదు. ఎందుకంటే దక్షిణాయణం ఏ తిథినాడు పూర్తయపోతుందో అది భోగి. దానికి ఒక్కదానికే మినహాయింపు పంచాంగంలో.
దక్షిణాయణం ఏ రోజున పూర్తి అయిపోతుందో అది భోగి పండగ. ఎందుకు అలా చెప్తారంటే దక్షిణాయణం అంతా ఉపాసన చేయాలి. భగవంతుని అనుగ్రహము కలిగి ఆయన దర్శనం అవుతుంది. ఆ భోగి జీవితంలో ఒక్క రోజైనా పొందగలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడు భోగం అనుభవించినవాడు.
అందుకని భోగి పండగ అన్నది వచ్చింది. ఉపాసన అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ఉపాసన అంటే ఏమిటంటే.. ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోవడం.. దగ్గరగా కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడి మూర్తిని పెట్టుకుని దగ్గరగా కూర్చోవాలని కాదు. మనసు లోపల దగ్గరగా ఉండడం.. అది ఉపాసన. దేవుడిని మనసులో నిలుపుకోవాలి.
అలా ఉపాసన చేయగా.. చేయగా.. చేయగా.. పరమాత్మ సంతోషిస్తాడు. సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతామో అది భోగి. దీనికి ముందున్న నెల రోజులు కూడా కన్నె పిల్లలందరితో గొబ్బెమ్మల్ని చేయిస్తారు. గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి ఉపాసన.
సంక్రాంతి రోజు ఇలా చేయండి..
మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాలము రెండుగా ఉంటుంది.. దక్షిణాయణము, ఉత్తరాయణము. దక్షిణాయణంలో దేవతలందరూ నిద్రపోతారు. ఉత్తరాయణంలో నిద్ర లేస్తారు. దేవతలు నిద్ర లేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తలోనే లేస్తారు.
తెల్లవారుజామున మూడు గంటల వేళ. దేవతలకి తెల్లవారు వేళ అంటే అది పరమ పవిత్రమైన కాలం. అందుకే ఉపనయనాలు, వివాహాలు దేవతా ప్రతిష్టలు.. ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మధ్యనం దానికి ప్రాధాన్యం.

సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం? చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం.. మధ్యనం అంటే మునకవేయడం. తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు. జీవనదులలో/పుష్కరణిలో స్నానం చేస్తుంంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్ర లేచే సమయం.. ఆ సమయంలో చదివే ఒక స్తోత్రం, ప్రదక్షిణం, నమస్కారం మనల్ని కాపాడతాయి.
అంతకన్నా అదృష్టం వేరొకటి ఉండదు..
జీవుడికి, దేవతలకి, అలాగే పితృ దేవతలకి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైన కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని మూట కట్టుకునే కాలం. ఆ రోజున సంక్రమణ నాడు వండుకున్న మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి, లేదా ఏదైనా జీవానికి ఇచ్చి, సంతోషించి తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు.
ఇంటికివచ్చిన అతిధి, అభ్యాగతి, భగవన్ నామోచ్చారణము, పవిత్ర గ్రంథ పఠనము, పెద్దల సేవనము, గురు దర్శనము.. ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయాల్సిన కృత్యములు. అందుకని భోగి, సంక్రాంతి అని ఈ రెండు పండగలు పక్క పక్కన వచ్చాయి.
మకర సంక్రమణం అనగానే మనకి అయ్యప్పలు జ్ఞాపకం వస్తారు. ఈ రోజున స్వామివారి పూర్తి దర్శనం అవుతుందని, అయ్యప్పను చూస్తామని ఎంతమందో భక్తులు జ్యోతి దర్శనానికి వెళ్తారు.
గుమ్మడిని దానం చేయటం చాలా విశేషమైన దానంగా చెప్తారు. కుష్మాండ దానం ఇస్తే భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. పూజారులకి ఇవ్వచ్చు, ఎవరో ఒకరికి బ్రహ్మచారికి ఇవ్వచ్చు. దేవాలయంలో ఇవ్వచ్చు. ఇతరులు ఎవరికైనా ఇవ్వచ్చు. పులుసు వండుకుంటారు.
మరణించిన తండ్రి, తాత వాళ్ల పేరుతో ఓ రెండు విస్తరాకులు పరిచి, వండిన పదార్థాలని అందులో నివేదన చేసి పెట్టుకోవాలి. వాళ్ల ఫొటోలు పెట్టి, వాళ్ల పేరుతో బట్టలు దానం చేయాలి. భోజనం ఎవరికైనా పెట్టొచ్చు. తండ్రి, తాత పేరుతో బట్టలు ఇవ్వచ్చు. ఇది తద్దినాలు, తిధులు పెట్టే అలవాటు ఉన్నవాళ్లు చేసే పని.
బొమ్మలు పెట్టే అలవాటు ఉన్నవాళ్లు బొమ్మలు పెట్టుకుని.. బొమ్మలకి హారతి ఇవ్వచ్చు. సంక్రమణం రోజున చేసే దాన ప్రక్రియ అంటే మన పెద్దవాళ్లకి తద్దినాలు వంటివి పెట్టడమే కాకుండా.. ఎవరికైనా ఏమైనా పంచి పెట్టడం వంటివి కూడా చేయొచ్చు. ఈ రోజున దేవతలు నిద్ర లేస్తారని చెబుతారు.
సూర్యుడే ఆరోగ్యకారకుడు ఆయన ఈ రోజు నుంచి ఉత్తరం వైపు నడక మొదలు పెడతాడు. ఈ నడక పూర్తిగా ఉత్తరం మీదగా వెళ్లదు. ఉత్తరం వైపునకు వాలి ఉదయించడం మొదలు పెడతాడు. పాలు పొంగించి, చెరుకుగడతో కలపడం వంటివి ఆంధ్ర, తెలంగాణలో చేయరు. తమిళనాడు వారు బాగా చేసుకుంటారు. మన పెద్దలు ఏం చేశారో అవి చేయాలి.
