Trump Zelenskyy Meeting
Trump Zelenskyy Meeting : రష్యా- యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎండ్‌కార్డ్ పడేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఆమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన ట్రంప్.. తాజాగా.. వైట్‌హౌస్‌లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ, యురోపియన్ దేశాల నేతలతో సమావేశం అయ్యారు. సమావేశం ముగింపు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపుపై కీలక కామెంట్స్ చేశారు. (Trump Zelenskyy Meeting)
జెలెన్‌స్కీతో పాటు వచ్చిన యూరప్ దేశాల అధినేతలు, ఈయూ, నాటో నేతలతో ఓవల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అద్భుతంగా జరిగిందని ట్రంప్ చెప్పారు. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు యుక్రెయిన్ కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, యుక్రెయిన్ తో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారని ట్రంప్ చెప్పారు. అయితే.. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నేను ఫోన్ కాల్‌లో మాట్లాడాను.. జెలెన్‌స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో పుతిన్, జెలెన్‌స్కీ భేటీ అవుతారు. అయితే, ఈ భేటీ ఎక్కడ జరగాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తరువాత వారితో కలిసి నేను భేటీ అవుతాను అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
వైట్‌హౌస్‌లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో జరిగిన చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని జెలెన్‌స్కీ చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకుంటున్నందుకు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ ఆలోచనను తాము సమర్థిస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఏ రూపంలోనైనా సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నా. మొదటి సమావేశం ఎలా జరిగే విధానాన్ని బట్టి తదుపరి రష్యా, అమెరికాతో త్రైపాక్షిక సమావేశానికి హాజరవుతానని, అయితే, తమకు యుద్ధ విరమణ అవసరం అని జెలెన్‌స్కీ తెలిపారు.
ట్రంప్ రాబోయే రెండు వారాల్లో జెలెన్ స్కీ, పుతిన్ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. రష్యా అధ్యక్షుడు, యుక్రెయిన్ అధ్యక్షుడి మధ్య రాబోయే రెండు వారాల్లో సమావేశం జరుగుతుందని ట్రంప్ పుతిన్‌తో తన సంభాషణలో పేర్కొన్నారని ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు.
వైట్‌హౌస్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పాల్గొన్నారు.