ఉక్రెయిన్ జనాభాలో కోటి మంది తగ్గిపోయారు. రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ జనాభాలో ఈ భారీ తేడా కనపడిందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తూర్పు యూరప్, మధ్య ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ ఫ్లోరెన్స్ బాయర్ తెలిపారు.
జెనీవాలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉక్రెయిన్ ప్రజలు వలసలు వెళ్తున్నారని, జననాల రేటు కూడా తగ్గిపోయిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
భద్రత, రక్షణ, సాయాన్ని కోరుతూ 67 లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ నుంచి వేరే దేశానికి వెళ్లిపోయారని చెప్పింది. వారు అధికంగా పోలాండ్, ఇతర పొరుగు దేశాలకు 2022 మే లోపు వెళ్లిపోయారని పేర్కొంది.
అనంతరం కూడా జనాభా తగ్గుతూనే వస్తోంది. రష్యా దాడులతో లక్షలాది మంది గాయపడ్డారని పేర్కొంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు ఉక్రెయిన్‌లో మొత్తం 41,048,766 మంది ఉన్నారు. ఇప్పుడు జనాభాలో 8.08 శాతం క్షీణత కనపడుతోంది.