US Election 2024: ’చెత్త‘ ట్రక్కును నడుపుతూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ట్రంప్.. వీడియో వైరల్

చెత్త ట్రక్కు పైనుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నా చెత్త లారీ మకు నచ్చిందా..? అంటూ విలేకరులను ట్రంప్ ప్రశ్నించారు.

Donald Trump

Donald Trump: మరో వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో చెత్త చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్ క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకో దేశాన్ని నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యూర్టోరికోకు చెందిన అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోనీ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ అభిమానులే అసలైన చెత్తగా అభివర్ణించారు.

Also Read: Viral Video: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. నడిరోడ్డుపై కనపడ్డ బ్యాలెట్‌ బాక్స్‌

జో బైడెన్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వావ్.. ఇది దారుణం. కానీ డెమోక్రాట్లకు ఇలా మాట్లాడటం అలవాటే అంటూ పేర్కొన్నారు. ‘చెత్త’ చుట్టూ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నవేళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెత్త ట్రక్కును నడుపుతూ కనిపించాడు. విస్కాన్సిస్ విమానాశ్రయంలో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని రాసిఉన్న ‘చెత్త’ ట్రక్కును నడుపుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు.

 

చెత్త ట్రక్కు పైనుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నా చెత్త ట్రక్కు మీకునచ్చిందా..? అంటూ విలేకరులను ట్రంప్ ప్రశ్నించారు. కమలాహారిస్, జో బైడెన్ గౌరవార్ధమే దీనిని వేసుకొచ్చానని వెల్లడించాడు. తద్వారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మద్దతుదారులను ‘చెత్త’తో పోల్చడంలో ట్రంప్ వినూత్నంగా స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.