US Elections 2024
US Elections 2024 Result: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ప్రతీ దేశంలో అమెరికా ఎన్నికలు, ఫలితాలపై చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్, కమల హారిస్.. ఇద్దరిలో ఎవరు నెగ్గుతారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమెరికా పెద్దన్న దేశంగా ఉంది. అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిని డిసైడ్ చేస్తాయి. పలు దేశాలకు ఇచ్చే మద్దతులుకూడా తారుమారైపోతాయి. అందుకే, అభ్యర్థుల ప్రసంగాలను, హామీలను ప్రపంచ దేశాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే టెన్షన్ తో ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశం వ్యాప్తంగా ప్రజలు అమెరికా ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, భారత కాలమానం ప్రకారం అమెరికాలో ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఫలితాలు వెంటనే వస్తాయా.. ఒకటిరెండు రోజులు సమయం పడుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్ Vs కమల.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు లాభం?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. అమెరికాలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ముందస్తుగా 7.5 కోట్ల మంది ఓట్లు వేశారు. 50 రాష్ట్రాల్లో బ్యాలెట్ పద్ధతిలో యూఎస్ పౌరులు ఓటు వేయనున్నారు. ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీ భాషల్లో బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచారు. 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఓట్లు సాధించిన వారే విజేత అవుతారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం రెండు రోజుల్లో పూర్తవుతుంది. అయితే, ఈ ఎన్నికల్లో విజయం సాధించే వ్యక్తి.. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
Also Read: గెలుపు ఎవరిది.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ప్రచారపర్వం హోరాహోరీగా సాగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. గెలిచేది మేము అంటూ ప్రకటించుకున్నారు. అయితే, ఈసారి తటస్థ ఓటర్లు ఎవరివైపు మొగ్గితే వారినే విజయలక్ష్మి వరించనుంది. అయితే, సర్వే సంస్థలు మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు ట్రంప్ విజయం సాధిస్తాడని చెప్పగా.. మరికొన్ని సర్వే సంస్థలు కమలా హారిస్ వైపు మొగ్గు చూపాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడాల్సిందే మరొక్కరోజు ఆగాల్సిందే మరి.