YouTube challenge
YouTube challenge – US Girl: హలో పోలీస్ అంకుల్.. నా ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేశారు అంటూ 911 నంబరుకు మెసేజ్ పంపి అసత్యాలు చెప్పి కలకలం రేపింది ఓ బాలిక. ఆమె వల్ల పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. చివరకు ఆ బాలికది ప్రాంక్ కాల్ అని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జువెనైల్ హోంకు తరలించారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో చోటుచేసుకుంది.
ఫ్లోరిడాలోని 11 ఏళ్ల ఓ బాలిక యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చూస్తుండేది. ఓ యూట్యూబ్ ఛాలెంజ్ చూసి అలా చేయాలనుకుంది. ఇలా చేస్తే చాలా సరదాగా ఉంటుందని భావించింది. ఎమర్జెన్సీ సేవల నంబరు 911కు మెసేజ్ పంపింది. తన ఫ్రెండ్ కి 14 ఏళ్లు ఉంటాయని, ఆమెను దుండగుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని పేర్కొంది.
తెల్లటి వ్యానులో వచ్చి దుండగుడు ఈ కిడ్నాప్ చేశాడని, అతడి వద్ద గన్ కూడా ఉందని చెప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ తెల్లటి వ్యాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అది దొరకలేదు. దీంతో తమకు మెసేజ్ పంపించిన అమ్మాయి ఇంటికి పోలీసులు వెళ్లారు.
ఆ బాలికను పోలీసులు ప్రశ్నించారు. దీంతో తాను యూట్యూబ్ ఛాలెంజ్ స్వీకరించి ఇలా చేశానని తెలిపింది. ఇటువంటి ప్రాంక్స్ చాలా డేంజర్ అని, దీనిపై తదుపరి విచారణ చేపడుతున్నామని పోలీసులు చెప్పారు. ఆ బాలిక తమ సమయాన్ని కూడా వృథా చేసిందని పోలీసులు అన్నారు.