కట్ చేస్తే.. లవర్ డెడ్ : సముద్రంలోకి దూకి గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్!

తన మనస్సులోని మాటను గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. తనను ఎలా ఇంప్రెస్ చేయాలా? అని తెగ ఆలోచించాడు. చివరికి తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ కాల్ చేసి టాంజానియా ట్రిప్ వెళ్దామన్నాడు. అక్కడే ప్రియురాలికి తన ప్రేమ విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు. అందుకు ఆమె సరే అంది. ఇద్దరూ కలిసి టాంజినియా ట్రిప్ కు వెళ్లారు.
ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికాలోని టూరిస్ట్ ప్రాంతమైన టాంజానియాకు వెళ్లారు. సముద్ర గర్భంలో చెక్కతో నిర్మించిన విశాలమైన క్యాబిన్ ఉంది. ట్రిప్ లో భాగంగా స్టీవెన్ వెబెర్, కెనేషా ఆంటోనీ ఇద్దరూ అందులో ఉంటున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసేందుకు ఇదే సరైన సమయమని భావించిన స్టీవెన్.. ఒక్కసారిగా సముద్రంలోపలికి దూకేశాడు.
అప్పటికే కాగితంపై తన మనస్సులోని మాటను రాసి పెట్టుకున్నాడు. కాగితం తడవకుండా ఉండేందుకు ఒక ప్లాస్టిక్ కవర్ లో లామినేషన్ చేశాడు. సముద్రం లోపల ఈదుతూ తాము ఉండే బెడ్ రూం విండో దగ్గరకు చేరుకున్నాడు. బెడ్ రూంలో ఉన్న తన ప్రియురాలికి తాను రాసుకున్న లెటర్ ను విండో అద్దానికి అతికించి ఇలా ప్రపోజ్ చేశాడు..
‘నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నో చెప్పేందుకు నా శ్వాసను ఎక్కువ సేపు ఆపలేను. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని నోట్ లో రాసి ఉంది. తనే జేబులో నుంచి గోల్డ్ రింగు బయటకు తీసి చూపిస్తూ ప్రపోజ్ చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్టీవెన్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్టు న్యూస్ వెబ్ సైట్ రిపోర్టు చేసింది.
తన కళ్లముందే లవర్ చనిపోవడం చూసి గర్ల్ ఫ్రెండ్ ఆంటోనీ షాకైంది. తనకు ప్రపోజ్ చేస్తుండగా తీసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నీ అందమైన ఆత్మకు ఇదే నా నివాళి.. స్టీవెన్ అని ఆమె పోస్టు చేసింది.
దీనికో క్యాప్షన్ కూడా పెట్టింది.. ‘ఎంతో లోతుకు చేరుకున్న నీవు ఇక కనిపించవు. నా సమాధానాన్ని నీవు వినలేవుని తెలుసు. అవును.. మిలియన్ల సార్లు ఇదే చెబుతాను. అవును.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ తాము కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియోను వేలాది పైగా షేర్లు చేశారు.