కరోనా మరణాల సంఖ్యలో ఇటలీని దాటేసిన అమెరికా

  • Publish Date - April 11, 2020 / 06:19 PM IST

చైనాలో పుట్టి ఇటలీని ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు అమెరికాను ఆగం చేస్తుంది, అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుంది. అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్..  చైనానే కాదు ఇటలీని కూడా మరణాల సంఖ్యలో దాటేసింది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మరణాలతోపాటు పాజిటివ్ కేసులు అత్య‌ధికంగా న‌మోదైన దేశంగా అమెరికా నిలిచింది. ఇప్ప‌టికే ఆ దేశంలో క‌రోనా మరణాల సంఖ్య 20 వేలకు చేరువగా వెళ్తుంది. దీంతో ఇటలీ రెండవ స్థానానికి పడిపోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు ల‌క్ష‌లు దాటింది. 

అయితే, మిగతా దేశాలతో పోలిస్తే కరోనా నిర్ధారణ పరీక్షల్ని అమెరికా భారీ స్థాయిలో పెంచింది. అందువల్లే ప్రతిరోజు పెద్ద ఎత్తున కొవిడ్‌-19 కేసులు నమోదవుతూ ఉన్నాయి. అమెరికాలో 18,860 మరణాలు చోటుచేసుకోగా.. ఇటలీలో మొత్తం 18,849 మంది ఇప్పటివరకు చనిపోయిరు.  

వైరస్‌ను నిరోధించడానికి బారీగా టెస్టింగ్‌లు, లాక్ డౌన్, సాంఘిక దూరం వంటి విస్తృత చర్యలను అమలు చేస్తుంది అమెరికా. అయితే కరోనావైరస్ కారణంగా ఒక్క రోజులోనే 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన మొట్టమొదటి దేశం అమెరికాగా నిలిచింది. గడిచిన 24గంటల్లోనే ఈ దేశంలో 2వేలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి. 

ఇప్పటికే ఆ దేశంలో లక్ష మంది చనిపోయే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే  అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాత్రం ముందు అనుకునట్లుగా లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉండకపోవచ్చని.. మరణాల సంఖ్య తగ్గొచ్చని అన్నారు.