PM Modi and US President Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి బుధవారం నేరుగా అమెరికా చేరుకున్న మోదీ.. వాషింగ్టన్ లో దేశాధ్యక్షుడి అతిథిగృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు. ఈ క్రమంలో మోదీకి భారత సంతతి అమెరికన్లు అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహదారు అజిత్ డోభాల్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
డొనాల్డ్ ట్రంప్ తో భేటీకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా జాతీయ భద్రతా సలహదారు (ఎన్ఎస్ఏ) మైఖేల్ వాల్జ్ తో భేటీ అయ్యారు. అదేవిధంగా స్పేస్ ఎక్స్ సీఈవో, అమెరికా డోజ్ అధినేత ఎలాన్ మస్క్ తోనూ సమావేశం అయ్యారు. అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్ తులసీ గాబార్డ్ తోనూ మోదీ సమావేశం జరిగింది. వీరితోపాటు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా మోదీతో సమావేశం అయ్యారు.
Also Read: Trump: భారతీయులకు ట్రంప్ మరో షాక్.. అమెరికా వర్క్ స్కీమ్స్ కఠినతరం? ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీకి కొద్దిగంటల ముందే కీలక ప్రకటన వెలువడింది. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికా దిగుమతులపై ఏ దేశాలు సుంకాలు వసూలు చేసినా తిరిగి ఆయా దేశాలపై సుంకాలు వసూలు చేస్తాం. అలాగని ఎక్కువ, తక్కువ కాకుండా ఆయా దేశాలకు మాకు ఎంత మేర సుంకం విధిస్తున్నాయో దానికి తగ్గట్లే మేంకూడా వసూలు చేస్తా’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ తాజా నిర్ణయం.. ట్రంప్ ఆర్థిక బృందం పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత అంటే కొన్ని వారాల తరువాత అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ట్రంప్ తో మోదీ భేటీ సందర్భంగా సుంకాల విషయంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారతదేశంపై ట్రంప్ సుంకాల ప్రభావం ఉండదని పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
#WATCH | Washington, DC: US President Donald Trump says, “More than anything else, we (PM Modi and US President Trump) have great unity, we have great friendship – he & I and our countries. I think it’s only going to get closer. But it’s very important that we remain united as… pic.twitter.com/OS5bojvNns
— ANI (@ANI) February 13, 2025
ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ మాట్లాడుతూ.. మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమని ట్రంప్ అన్నారు. చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితుడు, మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. మా రెండు దేశాల మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. భారత్, అమెరికా దేశాలు కలిసి ఉండటం చాలా ముఖ్యం అని ట్రంప్ అన్నారు.