US strikes : వెనెజువెలాపై ట్రంప్ ప్రతాపం.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్‌ల మోహరింపు.. అమెరికా అసలు టార్గెట్ అదేనా?

US strikes : అమెరికాతో పోలిస్తే వెనెజువెలా చాలా చిన్నదేశం. ఆ దేశంలో దాదాపు 3.15కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23లక్షల మంది సైన్యం ఉంది.

US strikes

US strikes : ప్రపంచంలోని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపుతున్నా.. ఇప్పటికే ఏడు యుద్ధాలను ఆపేశానంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీశారు. చిన్న దేశం వెనెజువెలాపై తన ప్రతాపం చూపేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు. ఈ మేరకు కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్ లను మోహరించారు.

Also Read: జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా.. ఎందుకంటే? నెక్స్ట్‌ పీఎంలో రేసులో వీరే.. భారత్‌పై ప్రభావం?

డ్రగ్ కార్టెల్స్‌పై యుద్ధం పేరుతో..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలపై కఠిన వైఖరిని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వెనెజువెలా నుంచి వస్తున్న డ్రగ్స్ వెనుక ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మడురో ఉన్నాడని ట్రంప్ చాలాకాలంగా చెబుతున్నారు.

ఆయన జాడను తెలిపితే ఏకంగా 50 మిలియన్ డాలర్లను (రూ.430కోట్లు) ఇస్తామంటూ వైట్‌హౌస్ ప్రకటించింది. అంతేగాక మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో హెచ్చరించారు.

ఇటీవల వెనెజువెలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరీబియన్ సముద్రంలో అమెరికా దళాలు దాడి చేశాయి. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మడురో.. తన యుద్ధ విమానాలను ఎగురవేశారు. ఈ ఘటన డొనాల్డ్ ట్రంప్‌కు మింగుడుపడలేదు. వెంటనే ఎనిమిది వార్ షిప్‌లను దక్షిణ కరీబియన్‌కు పంపారు.

శుక్రవారం రాత్రి 10 ఎఫ్-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో అమెరికా మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దింపింది. దీంతో కరేబియన్ జలాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనెజువెలాలో చొరబడవచ్చునని ప్రచారం జరుగుతోంది.

చిన్నదేశంలో చమురే లక్ష్యం..

అమెరికాతో పోలిస్తే వెనెజువెలా చాలా చిన్నదేశం. ఆ దేశంలో దాదాపు 3.15కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23లక్షల మంది సైన్యం ఉంది. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగి దేశం వెనెజువెలా.

2021 నాటికి ఆ దేశంలో 48వేల మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురు నిల్వల్లో 17శాతానికి సమానం. కానీ, ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం 0.8శాతం మాత్రమే. ఎందుకంటే.. అమెరికా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దీని ఆదాయం పడిపోయింది.

ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. అయితే, లాటిన్ అమెరికాలో పంటికింద రాయిలా మారిన వెనెజువెలాను లొంగదీసుకుని చమురును తమ గుప్పిట పెట్టుకోవాలన్నది అమెరికా లక్ష్యం. ఆ మేరకు ట్రంప్ ప్రయత్నాలు తీవ్రమయ్యాయి.