జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా.. ఎందుకంటే? నెక్స్ట్ పీఎంలో రేసులో వీరే.. భారత్‌పై ప్రభావం?
ఇషిబా తప్పుకోవడంతో ప్రధాని పదవికి పోటీ అధికారికంగా ప్రారంభమైంది. రేసులో ఉన్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి.

Who Will Be Japan’s Next PM: ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జపాన్ పీఎం షిగేరు ఇషిబా అధికారికంగా ప్రకటించారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో ఏడాదిగా విభేదాలు నెలకొన్నాయి.
దీంతో, అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజీనామా చేయనున్నట్లు ఇషిబా స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త ప్రధాని పదవి ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది జులైలో ఎగువసభలో ఎల్‌డీపీ కూటమి మెజార్టీ కోల్పోయింది. ఎన్నికల్లో ఓటిమికి బాధ్యత వహించాలని ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి దృష్ట్యా ఇషిబా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇషిబా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతుండడం వెనుక పార్టీలోని ఒత్తిడే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆయన రాజీనామా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. జపాన్‌ను నడిపించే తదుపరి నాయకుడు ఎవరన్నది ఆసక్తిగా మారింది.
జపాన్ తదుపరి ప్రధాని ఎవరు?
ఇషిబా తప్పుకోవడంతో ప్రధాని పదవికి పోటీ అధికారికంగా ప్రారంభమైంది. రేసులో ఉన్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఏ నేతైనా సరే ఈ పోటీలోకి ప్రవేశించడానికి కనీసం 20 మంది పార్లమెంటు సభ్యుల మద్దతును సంపాదించాలి. మొదట “పార్టీ ఓటు”లో గెలిచిన నేత.. ఆ తరువాత ప్రధాని కావడానికి పార్లమెంటు మద్దతు పొందాలి. ఎల్‌డీపీకి ఇరు సభల్లో మెజారిటీ లేకపోయినప్పటికీ, లోయర్ హౌస్ లో అతిపెద్ద బ్లాక్ అదే.
సనయే టకాయిచి
జపాన్ అంతర్గత వ్యవహారాల మాజీ మంత్రి సనయే టకాయిచి ప్రధాని రేసులో ఉన్నారు. గత సంవత్సరం ఇషిబా నాయకత్వ పోటీలో ఆమె రెండవ స్థానంలో నిలిచారు. వడ్డీ రేట్ల పెంపుపై జపాన్ బ్యాంక్ జాగ్రత్తగా విధానాలను అవలంబించాలని ఆమె వాదిస్తున్నారు. జపాన్ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టే వ్యయ విధానాలు మరింత సమర్థంగా ఉండాలంటున్నారు.
షింజిరో కోయిజుమి
వ్యవసాయ మంత్రి షింజిరో కోయిజుమి (మాజీ ప్రధానమంత్రి కోఇజుమి కుమారుడు) పోటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన నాయకత్వం యువతను ఆకర్షిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఎల్‌డీపీకి భవిష్యత్తులోనూ సపోర్టు దక్కుతుందని చెబుతున్నారు. కోయిజుమి శనివారం ఇషిబాను కలిసి ఆయనను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరారు.
తకయుకి కోబయాషి
మాజీ ఆర్థిక భద్రతా మంత్రి తకయుకి కోబయాషి కూడా ప్రధాని రేసులో ఉండే అవకాశం ఉంది. టకాఇచికి ప్రత్యర్థిగా మద్దతు పొందే అవకాశముంది.
హయాషి, కత్సునోబు
ప్రస్తుత చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి, అలాగే ఆర్థిక మంత్రి కత్సునోబు కాటో ప్రధాని రేసులో నిలిచే అవకాశం ఉంది.
భారత్‌పై ప్రభావం?
ఇషిబా, మోదీ కలిసి జపాన్ ప్రైవేట్ పెట్టుబడులను భారతదేశంలో $2.7 బిలియన్ నుంచి $6.8 బిలియన్‌కు వార్షికంగా పెంచాలని ప్రకటించారు. దీన్ని అమలు చేయాల్సి ఉంది. 5 సంవత్సరాల్లో 500,000 మంది కార్మికులు, విద్యార్థుల మార్పిడిని సులభతరం చేసే ఒప్పందం కూడా ఇషిబా నాయకత్వంలోని జపాన్‌తో భారత్ చేసుకుంది.
ఇషిబా రాజీనామా తరువాత యెన్ విలువ తగ్గడం, బాండ్ మార్కెట్ మార్పులు సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి భారత ఎగుమతులు, పెట్టుబడులపై పరోక్ష ప్రభావం చూపవచ్చు. జపాన్ రాజకీయ అనిశ్చితి వల్ల జపాన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపొచ్చు.