“G7” నుంచి వెళ్తూ “కాల్పుల విరమణ కోసం కాదు.. అంతకు మించి” అంటూ ట్రంప్ మరో సంచలనం.. ఏం జరగబోతోంది?

ట్రంప్ చెప్పిన ఆ "పెద్ద విషయం" ఏమై ఉంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Donald Trump-Emmanuel Macron

G7 సదస్సు జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్‌కు బయలుదేరడం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ (Ceasefire) చర్చల కోసమే ఆయన వెళ్లారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ట్రంప్ ఆ వాదనను తీవ్రంగా ఖండించారు. అసలు కారణం వేరే ఉందని, అది చాలా పెద్ద విషయమని చెబుతూ కొత్త ఉత్కంఠకు తెరలేపారు.

అంతకు మించి..: ట్రంప్

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. “ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పిందంతా తప్పుడు సమాచారం. నేను ఎందుకు వాషింగ్టన్‌కు వెళ్తున్నానో ఆయనకు తెలియదు. కానీ, అది కచ్చితంగా కాల్పుల విరమణ కోసం కాదు. అంతకంటే పెద్ద కారణం ఉంది” అని ఆయన పోస్ట్ చేశారు. అయితే ఆ ‘పెద్ద కారణం’ ఏంటో వెల్లడించకుండా, చివర్లో “Stay Tuned!” (వేచి చూడండి!) అని రాసి సస్పెన్స్‌ను మరింత పెంచారు ట్రంప్.

Also Read: ఇరాన్‌లోని వేలాది మంది భారతీయుల కోసం కేంద్రం కీలక చర్యలు.. ఇప్పటికే 100 మంది తరలింపు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

ఇంతకీ మాక్రాన్ ఏమన్నారు?

అంతకుముందు G7 సదస్సులో మాక్రాన్ మాట్లాడుతూ.. “ట్రంప్ ఈ సదస్సు నుంచి ముందుగా వెళ్లడం ఒక సానుకూల పరిణామం. కాల్పుల విరమణపై చర్చలకు ఒక ఆహ్వానం అందింది. దీని ద్వారా విస్తృత చర్చలకు మార్గం సుగమం అవుతుంది” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో మాక్రాన్ మాటలు అవాస్తవమని తేలిపోయింది.

తెర వెనుక అసలు కథ వేరే ఉందా?

మరోవైపు, అమెరికా-ఇరాన్ అధికారుల మధ్య ఈ వారం రహస్యంగా ఒక సమావేశం జరిగే అవకాశం ఉందని, అందులో ఇరాన్ అణు ఒప్పందం (Nuclear Deal) పై చర్చలు జరగవచ్చని ప్రముఖ వార్తా సంస్థ ‘యాక్సియోస్’ నివేదించింది. బహుశా ఈ సమావేశం కోసమే ట్రంప్ వెళ్లారా? అనే ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

G7 వేదికగా ట్రంప్ సృష్టించిన ఈ సస్పెన్స్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ట్రంప్ చెప్పిన ఆ “పెద్ద విషయం” ఏమై ఉంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.