ఇరాన్‌లోని వేలాది మంది భారతీయుల కోసం కేంద్రం కీలక చర్యలు.. ఇప్పటికే 100 మంది తరలింపు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
ఇరాన్‌లో ఉన్న భారతీయులు భద్రత కోసం ఎంబసీ జారీ చేసిన సూచనలను తప్పక పాటించాలి.

Representative Image
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌లో నివసిస్తున్న సుమారు 10,000 మంది భారతీయుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జారీ చేసిన అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల పూర్తి వివరాలు ఇవే..
సురక్షిత ప్రాంతాలకు విద్యార్థుల తరలింపు
భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి భారత పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరాన్‌లోని ఉర్మియా నగరంలో ఉన్న 100 మంది భారత విద్యార్థులు ఇప్పటికే అర్మేనియా సరిహద్దుకు సురక్షితంగా చేరుకున్నారు. త్వరలోనే వారిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకురానున్నారు.
ఇజ్రాయెల్ దాడుల భయం ఎక్కువగా ఉన్న రాజధాని టెహ్రాన్‌లోని 600 మంది విద్యార్థులను సురక్షిత నగరమైన క్వోమ్‌కు తరలించారు. అదే విధంగా, షిరాజ్, ఇస్ఫహాన్ నగరాల్లోని విద్యార్థులను యాజ్ద్ అనే సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యలు
విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ స్వయంగా అర్మేనియా విదేశాంగ మంత్రితో అలాగే యూఏఈ ఉపప్రధానితో మాట్లాడి, భారతీయుల తరలింపునకు సహకారం కోరారు.
ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy) విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పిల్లలను వెంటనే స్వదేశానికి రప్పించాలని కశ్మీర్‌కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
ఇరాన్‌లో ఉన్న భారతీయులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం భారత ప్రభుత్వం 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌లను, హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
భారత విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్ (ఢిల్లీ)
టోల్ ఫ్రీ: 1800 11 8797
ఫోన్: +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905
వాట్సాప్: +91-9968291988
ఈ-మెయిల్: situationroom@mea.gov.in
భారత రాయబార కార్యాలయం (టెహ్రాన్)
కాల్: +98 9128109115, +98 9128109109
వాట్సాప్: +98 901044557, +98 9015993320, +91 8086871709
ఇమెయిల్: cons.tehran@mea.gov.in
ప్రాంతీయ సహాయం కోసం:
బందర్ అబ్బాస్: +98 9177699036
జాహెదాన్: +98 9396356649
ప్రస్తుత పరిస్థితుల్లో భయాందోళనలకు గురికావొద్దని, ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు భద్రత కోసం ఎంబసీ జారీ చేసిన సూచనలను తప్పక పాటించాలి. ఈ అత్యవసర సమాచారాన్ని ఇరాన్‌లో ఉన్న మీ మిత్రులు, బంధువులతో పంచుకోండి.