తారస్థాయికి యుద్ధం.. ఇరాన్ సుప్రీంలీడర్‌ను హతమార్చాల్సిందేనంటూ నెతన్యాహు కామెంట్స్.. “జీ7” నుంచి బయలుదేరనున్న ట్రంప్
ఆయా ప్రాంతాల వారు బాంబు షెల్టర్లకు వెళ్లాలని సూచించింది.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తారస్థాయికి చేరింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. టెల్‌అవీవ్, హైఫా సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.
తమ ప్రాంతం వైపుగా ఇరాన్ మరిన్ని క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్ అంతటా సైరన్లు వినిపిస్తున్నాయని ఐడీఎఫ్ చెప్పింది. ఆయా ప్రాంతాల వారు బాంబు షెల్టర్లకు వెళ్లాలని సూచించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనడం గమనార్హం.
ప్రతీకార దాడులపై ఇజ్రాయెల్ దీటుగా స్పందిస్తోంది. టెహ్రాన్‌లో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐఆర్‌ఐబీ ఆఫీసు ఉన్న ప్రాంతంతో పాటు టెహ్రాన్‌లోని 3 జిల్లాలను ఖాళీ చేయాలంటూ ఇరాన్ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
జీ7 సమ్మిట్ నుంచి ట్రంప్ తిరుగు ప్రయాణం
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముదురుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి ఇవాళ రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. “మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు రాత్రి ఇతర దేశాధినేతలతో విందు తర్వాత బయలుదేరుతారు” అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ చేశారు. “అమెరికా ఫస్ట్ అనేది గొప్ప విషయాలకు సంకేతం. అందులో ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను పొందలేని పరిస్థితిని తీసుకురావడమూ ఒకటి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అని పేర్కొన్నారు.