Donald Trump
Donald Trump : అమెరికాలో భారతీయుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. డల్లాస్‌లో కర్ణాటకు చెందిన చంద్ర నాగమల్లయ్య (50) ఓ మోటెల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే చోట మార్టినెజ్ (37) సిబ్బందిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీన నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య వివాదం జరిగింది. ఈ అక్రమంలో మార్టినెజ్ తన బ్యాగులో ఉన్న కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మల్లయ్య కొడుకు, భార్య అడ్డొచ్చినా వారిని పక్కకు నేట్టేసి.. నిందితుడు మల్లయ్య తల నరికి మరీ దానిని చెత్తబుట్టలో వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన తరువాత పోలీసులు హత్యా నేరం కింద మార్టినెజ్‌ను అరెస్టు చేశారు. అయితే, నాగమల్లయ్య హత్య ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
Also Read: నేపాల్ కొత్త పీఎం సుశీల కర్కి సంచలనం.. అల్లర్లు చేసిన వాళ్ల మీద కేసులు
నాగమల్లయ్య హత్యపై ట్రూత్ సోషల్ లో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘‘నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి. డల్లాస్ లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబంధం లేని, క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ వ్యక్తిని గతంలో పిల్లలపై లైంగిక వేధింపులు, కారు దొంగతనం, తప్పుడు జైలు శిక్ష వంటి దారుణమైన నేరాలకు గతంలో అరెస్టు చేయబడ్డాడు. కానీ, గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడింది. అతడికి నేర చరిత్ర ఉన్నా.. నివాసానికి అనుమతించారు. అక్రమ వసలదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోను. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ మరియు నా పరిపాలనలోని అనేక మంది ఇతరులు, అమెరికాను మళ్ళీ సురక్షితంగా ఉంచడంలో అద్భుతమైన పని చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నేరస్థుడిని చట్టం పరిధిలో పూర్తి స్థాయిలో విచారిస్తారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
నిందితుడు మార్టినెజ్ గతంలోనూ పలు నేరాలు చేశాడు. క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో అమెరికాలోనే ఉండిపోయాడు. ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం జైలు నుంచి విడుల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. నాగమల్లయ్య దారుణ హత్యపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేశారు. సెప్టెంబర్ 13న నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.