×
Ad

New US Visa Rules: ఇక యూఎస్ వీసా పొందడం అంత ఈజీ కాదు..! ట్రంప్ కొత్త రూల్.. ఈ జబ్బులు ఉంటే నో వీసా..!

దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

New US Visa Rules: అమెరికా వీసా పొందాలంటే అంత ఈజీ కాదిక. విదేశీయులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా వీసా జారీకి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం రూల్స్ ను మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధన తీసుకొచ్చింది. డయాబెటిస్‌, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త రూల్ రూపొందించారు. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్‌ కార్యాలయాలకు విదేశాంగ శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది.

సాధారణంగా అమెరికా వీసా కోసం అప్లయ్ చేసుకునే వారి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేస్తారు. US రాయబార కార్యాలయం ఆమోదించిన డాక్టర్ ఈ వైద్య పరీక్షలు చేస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ చేస్తారు.

తాజాగా ఈ నిబంధనలను సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ లిస్ట్ లో చేర్చారు. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్‌ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి పెడతారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఆ తర్వాత వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది.

”దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ఎందుకంటే.. గుండె జబ్బులు, శ్వాస సంబంధ వ్యాధులు (ఆస్తమా), క్యాన్సర్‌, డయాబెటిస్‌, జీవక్రియ, నాడీ సంబంధ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే ప్రభుత్వం లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్‌ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. అంతేకాదు ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి.

అంతేకాదు.. ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా? అన్నది కూడా నిర్ధారించుకోవాలి” అని గైడ్ లైన్స్ లో ఉందని వీసా అధికారులు తెలిపారు.

Also Read: అమెరికా ఎయిర్ బేస్‌లో పౌడర్ కలకలం.. అస్వస్థతకు గురైన సైనికులు.. ఏంటా పౌడర్..