USS Abraham Lincoln
US Strikes : ఇరాన్‌పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
Also Read : Donald Trump : ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన మచాడో.. ఇలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా? రూల్స్‌లో ఏం ఉంది?
అమెరికన్ న్యూస్ వెబ్‌సైట్ నేషన్ కథనం ప్రకారం.. ఇరాన్ గగనతలం మూతపడిన సరిగ్గా గంట తరువాత ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత శక్తిమంతమైనదిగా భావించే అణుశక్తి సామర్థ్యమున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు పయనమైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ నౌకను చైనా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ చైనా సముద్రంలో మోహరించారు. తాజాగా.. అక్కడి నుంచి పశ్చిమాసియా వైపు బయల్దేరినట్లు కథనం పేర్కొంది. ఈ శక్తివంతమైన యుద్ధనౌక పశ్చిమాసియాను చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. అయితే, అమెరికా అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధ్రువీకరించలేదు. ఇదిలాఉంటే.. వెనెజువెలాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు.. ఇరాన్‌పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు అంతర్జాతీయ మీడియాలలో కథనాలు వచ్చాయి. ట్రంప్ నిర్ణయం వెనుక ప్రధాన కారణమే ఉందట.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారుల అణచివేత విషయంలో టెహ్రాన్ వెనక్కు తగ్గింది. దీంతో సమీప భవిష్యత్తులో ఆ దేశంపై దాడి చేయబోన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.
ఇరాన్ పై దాడులకు దిగితే ఆ దేశంలో అనిశ్చితి మరింత పెరిగే ముప్పు ఉండట, ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉండటం, వాషింగ్టన్ పరిమిత స్థాయి సైనిక చర్యతో ఆగిపోకుండా దీర్ఘకాలం పాటు దాడులు కొనసాగించక తప్పని పరిస్థితులు తలెత్తొచ్చునన్న అంచనాలు.. ఇవన్నీ సైనిక చర్యపై ట్రంప్ నిర్ణయం మార్పునకు కారణమైనట్లు తెలుస్తోంది.