Snapshot of the woman adding hair to food (Facebook/@TheObservatory)
భోజనం చేద్దామని ఓ మహిళ తన భర్తతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడకు వెళ్లాక ఆమెకు దుర్బుద్ధి పుట్టింది. భోజనానికి డబ్బులు కట్టకుండా ఫ్రీగా లాగించేందుకు పెనిమిటితో కలిసి పక్కా ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్లాన్ కూడా పక్క్గాగా అమలు చేసింది. తమ పన్నాగం ఫలించడంతో సుష్టుగా తినేసి బిల్లు కట్టకుండానే ఉడాయించారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ వీడియో చూసిన వాళ్లందరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇంతకీ ఆ వీడియో ఏముంది?
వీడియో ప్రారంభం కాగానే తన ప్లాన్ గురించి భర్తతో చెవిలో చెబుతుంది సదరు మహిళ. భార్య ప్లాన్ కు భర్త ఏమాత్రం అడ్డుచెప్పకుండా ”అయితే ఒకే” టైపులో గమ్మునుంటాడు. దీంతో ఆ మహిళ తన ప్లాన్ ను అమలు చేస్తుంది. తన తలలోని వెంట్రులను తెంపి తన ఎదురుగా ఉన్న భోజనం ప్లేటులో వేస్తుంది. తర్వాత భర్త ప్లేటులో కూడా వేస్తుంది. వీడియోలో ఇంతవరకే ఉంది. తర్వాత ఏం జరిగిందో మనం ఈజీగా ఊహించుకోవచ్చు. భోజనంలో వెంట్రుకలు ఉన్నాయని హడావుడి చేయడంతో భయపడిపోయిన హోటల్ యజమాని బిల్లు వద్దని చెప్పడంతో ఆ జంట అక్కడి వెళ్లిపోతుంది. తర్వాత అనుమానం వచ్చిన ఓనర్ సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేయడంతో ఈ బాగోతం బయటపడింది.
ఎవరూ మోసపోకూడదనే..
ఈ సీసీ టీవీ ఫుటేజీని సదరు యజమాని ఫేస్ బుక్ లో షేర్ చేసి తన బాధను పంచుకోవడంతో కిలేడీ వ్యవహారం బయట ప్రపంచానికి తెలిసింది. తనలా ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోను బయపెట్టినట్టు అతడు వెల్లడించాడు. ఇలాంటి వాళ్లతో జాగ్ర్తత్తగా ఉండాలని సూచించాడు. బ్రిటన్ లోని బ్లాక్బర్న్ నగరంలో చోటుచేసుకుందని ప్లైమౌత్ లైవ్ తెలిపింది. ఆ హోటల్ యజమాని పేరు టామ్ క్రాఫ్ట్. నవంబర్ 5న ఈ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. దీనికి వేల సంఖ్యలో వ్యూస్, కమెంట్స్ వచ్చాయి.
చాలా నెటిజనులు కిలాడీ మహిళపై కారాలు మిరియాలు నూరుతూ కమెంట్స్ పెట్టారు. మోసపోయిన యజమానిపై సానుభూతి చూపించారు. మీకు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. కానీ ధైర్యంగా ఈ వీడియో షేర్ చేసినందుకు అభినందనలు అని ఒకరు పేర్కొన్నారు. బిల్లు కట్టకుండా చెక్కేయడానికి ఏమైనా చేస్తారా? ఇంకా ఎన్నిచోట్ల ఇలాంటి ఘనకార్యాలు చేశారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలు చేయడానికి ఎంత ధైర్యం అని కొంతమంది ప్రశ్నించారు.