Video: 10 నిమిషాల్లో అంతరిక్షంలోకి వెళ్లారు.. భూమిపైకి తిరిగొచ్చారు.. “ఇంద్ర”లో చిరు స్టైల్‌లో భూమిని ముద్దాడిన కేటీ పెర్రీ

వారంతా న్యూ షెపర్డ్-31 మిషన్‌లో భాగంగా బ్లూ ఆరిజిన్‌కు సంబంధించిన రాకెట్‌లో ప్రయాణం చేశారు.

Video: 10 నిమిషాల్లో అంతరిక్షంలోకి వెళ్లారు.. భూమిపైకి తిరిగొచ్చారు.. “ఇంద్ర”లో చిరు స్టైల్‌లో భూమిని ముద్దాడిన కేటీ పెర్రీ

Updated On : April 15, 2025 / 12:40 PM IST

అమెరికా బిజినెస్‌ మ్యాన్ జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ సోమవారం తన 11వ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.

పాప్ స్టార్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్‌, పౌర హక్కుల లాయర్ అమండా ఇన్గుయెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, సీనీ నిర్మాత కెరియాన్ ఫ్లిన్ అంతరిక్ష అంచును దాటి తిరిగి భూమి మీదకు వచ్చారు. కేవలం 10 నిమిషాల్లో వాళ్లు ఆ యాత్రను ముగించారు.

బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యాత్ర తర్వాత కేటీ పెర్రీ సురక్షితంగా దిగి, భూమిని ముద్దాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భూ వాతావరణానికి అంచు వద్ద ఉండే ఊహాత్మక సరిహద్దు కర్మన్ రేఖను వారు ఆరుగురు దాటి వచ్చారు.

వారంతా న్యూ షెపర్డ్-31 మిషన్‌లో భాగంగా బ్లూ ఆరిజిన్‌కు సంబంధించిన రాకెట్‌లో ప్రయాణం చేశారు. ఇది ఆటోమేటెడ్‌గా పనిచేస్తుంది. దాన్ని లోపల ఎవరూ ఆపరేట్ చేయరు. కర్మన్ రేఖ వద్ద ఈ ఆరుగురు కొన్ని నిమిషాలు జీరో గ్రావిటీని అనుభవించారు. అక్కడి నుంచి కొద్దిసేపు భూ గ్రహాన్ని చూశారు.

నిన్న రాత్రి యూఎస్‌లోని వెస్ట్ టెక్సాస్‌లోని ‘బ్లూ ఆరిజిన్’ కంపెనీ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. పశ్చిమ టెక్సాస్ నుంచి పూర్తిగా ఆటోమేటెడ్ న్యూ షెపర్డ్ క్యాప్సూల్‌లో ఆ ఆరుగురు మహిళలు రాకెట్లో అంతరిక్షానికి వెళ్లారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు వంటి కర్మన్ లైన్‌ను దాటి, సిబ్బంది 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్నారు. తిరిగి భూమిపై సజావుగా ల్యాండ్ అయ్యారు.