Maria Corina Machado
Greenland : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ పై పట్టుదలతో ఉన్నాడు. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు గ్రీన్‌లాండ్‌తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్‌తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
Also Read : Trump – Machado : ఎట్టకేలకు ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బహుమతి..! ‘థ్యాంక్ యూ ట్రంప్’ అంటూ నినాదాలు..
గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను ఇప్పటికే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పేర్కొంది. ట్రంప్ బెదిరింపులకు గ్రీన్‌లాండ్‌తోపాటు దానిపై పాక్షిక ఆధిపత్యమున్న డెన్మార్క్ మండిపడుతున్నాయి. యుద్ధానికి సిద్ధమేనని ఆ రెండు దేశాలు అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసిరుతున్నాయి.
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్‌హౌస్‌లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్‌తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. అయితే, తాజాగా.. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ నిర్ణయం వెనుక ఉద్దేశాన్ని వైట్‌హౌస్ బయటపెట్టింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ను ఆధీనంలోకి తీసుకోవడం దేశ భద్రతకు అత్యంత అవసరమని ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు.
‘ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్ గా ఉన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది అమెరికా దేశ భద్రతకు అవసరమని ఆయన నమ్ముతున్నారు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.
మరోవైపు.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి కారణంగా ఇరాన్‌లో 800 మంది నిరసనకారులపై అమలు చేయాల్సిన ఉరిశిక్షలను నిలిపివేశారని కరోలిన్ లివిట్ తెలిపారు. ‘‘నిరసనకారుల హత్యలు కొనసాగితే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్ 800 మంది నిరసనకారులకు ఉరిశిక్షలను నిలిపివేసింది’’ అని కరోలిన్ లివిట్ తెలిపారు.