హిందూ సమాజంలో బ్రాహ్మణులు ఉంటారు. అదే పేరును పోలి అమెరికా, ఇంగ్లాండ్‌లోనూ “బోస్టన్ బ్రాహ్మిన్స్” ఉంటారన్న విషయం మీకు తెలుసా?
“ఆస్ట్రోనమర్” సీఈవో ఆండీ బ్రయన్ తమ కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ క్రిస్టిన్ క్యాబట్‌తో సన్నిహితంగా గడుపుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. చివరకు ఆయన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మసాచుసెట్స్‌లోని గిల్లెట్ స్టేడియంలో గతవారం జరిగిన ఓ కోల్డ్‌ప్లే కాన్సెర్ట్‌లో ఆండీ బ్రయన్, క్రిస్టిన్ క్యాబట్ రొమాంటిక్ మూడ్‌లో కనపడ్డ వీడియో విపరీతంగా వైరల్ అయింది.
క్రిస్టిన్ క్యాబట్‌తో ఎఫైర్ నడుపుతూ ఆండీ బ్రయన్ తన భార్యను మోసం చేశాడు. ఆండీ బ్రయన్‌తో సన్నిహితంగా ఉంటూ క్రిస్టిన్ క్యాబట్ తన భర్తను మోసం చేసింది. ఆండీ బ్రయన్, క్రిస్టిన్ క్యాబట్ మధ్య ఉన్న ఎఫైర్ అనూహ్య రీతిలో బయటపడింది.
క్రిస్టిన్ క్యాబట్‌కు బోస్టన్‌లోని ప్రసిద్ధ వంశాల్లో ఒకటైన క్యాబట్ కుటుంబంలోని వ్యక్తితో 2022లోనే పెళ్లి జరిగింది. ఈ కుటుంబం “బోస్టన్ బ్రాహ్మిన్లు”గా పిలిచే అమెరికా సంపన్న వర్గానికి చెందింది. అంటే క్యాబట్ వంశానికి చెందినవారు బోస్టన్ బ్రాహ్మిన్లే.
బోస్టన్ బ్రాహ్మిన్లు అంటే ఎవరు?
“ఫస్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ బోస్టన్”గా పిలిచే ఈ బ్రాహ్మిన్లు 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్ద ప్రారంభం వరకు న్యూఇంగ్లాండ్‌పై ప్రభావం చూపిన ఆంగ్లో-సాక్సన్ ప్రొటెస్టెంట్ కుటుంబాలకు చెందినవారు. వీరికి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలను శాసించిన అమెరికన్ అరిస్టోక్రసీగా గుర్తింపు ఉంది.
బోస్టన్‌లో పిల్లలకు ఓ వాక్యాన్ని నేర్పేవారు. “ఇది బోస్టన్ నగరం.. బీన్స్, కాడ్‌కు ప్రసిద్ధి. లోవెల్స్ క్యాబట్స్ తోనే మాట్లాడతారు. దేవుడితో మాత్రమే క్యాబట్స్ మాట్లాడతారు” అని బోధించేవారు.
బోస్టన్ బ్రాహ్మిన్ జీవన శైలి
ఇది వంశపారంపర్యంగా వస్తోంది. ఇందులో నియమాలను పాటించడం, పరిమితితో ఉండడం, సంస్కారానికి ప్రాముఖ్యం ఇస్తారు. బోస్టన్‌లోని మెట్రో ట్రాన్సిట్ సిస్టమ్‌లోనే వీరు ప్రయాణిస్తారు. అట్టడుగున ఉన్నవారు మాత్రమే ఇందులో ప్రయాణిస్తారని భావించేవారు.
సంప్రదాయ, విద్యా సంస్థల శైలి దుస్తులను (ప్రిప్పీ డిజైన్ దుస్తులు) ఏడాదికి ఒక్కసారైనా కొనుగోలు చేస్తారు. స్పష్టంగా బ్రిటిష్ శైలిలో మాట్లాడతారు. ఈ బ్రాహ్మిన్లు పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. వీరు పేర్లు పత్రికలో మూడుసార్లే రావాలి. పుట్టినప్పుడు, పెళ్లి అయినప్పుడు, మరణించినప్పుడే పత్రికల్లో తమ పేర్లను వేయాలని చెబుతారు. కానీ, కాలక్రమేణా చాలా మంది ప్రజా జీవితంలోకి వెళ్లారు. కళాశాలలు స్థాపించారు, పత్రికా సంస్థలను నెలకొల్పారు.
బోస్టన్ బ్రాహ్మిన్స్ తమ వర్గంవారినే పెళ్లి చేసుకుంటారు. వారి వంశాలు ఆపెల్టన్, బేకన్, క్యాబట్, కాడ్‌మన్, కూలిడ్జ్, క్రౌనిన్‌షీల్డ్, ఫోర్బ్స్, హన్నెవెల్, లాడ్జ్, లోవెల్, పార్క్‌మన్, పర్కిన్స్, రస్సెల్, సాల్టన్‌స్టాల్, షాటక్, షా, విన్‌త్రోప్.
“బోస్టన్ బ్రాహ్మిన్లు” అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు?
ఆలివర్ వెండెల్ హోల్మ్స్ సీనియర్ 1861లో ఎల్సీ వెన్నెర్ నవలలో ఈ పదాన్ని ప్రవేశపెట్టారు. న్యూఇంగ్లాండ్ గురించి వర్ణిస్తున్న వేళ.. “ఇది బ్రాహ్మణ వర్గం.. విలువలు, నియమాలు, విద్య, నైతికతతో కూడిన గొప్ప నగరాన్ని నిర్మించడానికి వీరు పుట్టారు” అని పేర్కొన్నారు.
న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబట్స్ 10 తరాలుగా న్యూఇంగ్లాండ్‌లో ఉన్నారు. వారి సంపద “కార్బన్ బ్లాక్” (టయర్ల తయారీలో ఉపయోగించే పదార్థం) వ్యాపారంతో పెరిగింది. ప్రస్తుతం వారు కొన్ని కుటుంబ బిజినెస్‌లు నడుపుతున్నారు. వాటిలో ఒకటి ప్రైవటీర్ రమ్.. ఇది క్రిస్టిన్ భర్త ఆండ్రూ క్యాబట్‌కి చెందింది. క్రిస్టిన్.. 2022లో విడాకులు పూర్తి చేసుకుని ఆండ్రూని వివాహం చేసుకుంది.