Solar eclipse: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. శతాబ్దంలో ఒక్కసారే ఇలా జరుగుతుంది.. ఫుల్ డీటెయిల్స్..
భూమి మీద 1991 నుంచి 2114 మధ్యకాలంలో కనిపించే సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తుంది.

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో 2027, ఆగస్టు 2న ఏకంగా 6 నిమిషాల 23 సెకన్లపాటు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఈ శతాబ్దంలో కనపడుతున్న అద్భుత దృశ్యం ఇది.
ఈ సూర్యగ్రహణం చాలా సేపు ఉంటుండడం దృష్ట్యా దీన్ని ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సాధారణంగా గ్రహణాల్లో సూర్యుడి కరోనా కేవలం 3 నిమిషాల కన్నా తక్కువసేపు మాత్రమే కనిపిస్తుంది. గ్రహణ సమయంలో కనిపించే సూర్యుని వెలుగు కాంతి పరిమితి (బాహ్య కిరణజాలం)ని కరోనా అంటారు.
space.com తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రహణం భూమి మీద 1991 నుంచి 2114 మధ్యకాలంలో కనిపించే సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తుంది. 6 నిమిషాల 23 సెకన్లపాటు చీకటి కమ్ముకోనుంది.
Also Read: కేరళకు గుడ్ బై.. బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ ఇక ఎగిరిపోనుంది..
భూమి 2027, ఆగస్టు 2న అప్హీలియన్ సమీపంలో ఉంటుంది. భూమి తన కక్షలో సూర్యుని నుంచి అత్యధిక దూరంలో ఉండే స్థానాన్ని అప్హీలియన్ అంటారు. దాంతో సూర్యుడు కొంచెం చిన్నగా కనిపిస్తాడు. అదే సమయంలో చంద్రుడు పెరిజీ సమీపంలో ఉంటాడు.
చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే స్థితే పెరిజీ. దీంతో చంద్రుడు కొంచెం పెద్దగా కనిపిస్తాడు. ఈ రెండు కలయికలు సూర్యుడిని పూర్తిగా కప్పిపెట్టి ఉంచుతాయి. చంద్రుడి నీడ భూమిపై నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దీంతో గ్రహణ కాలం అధికంగా ఉంటుంది.
ఎక్కడ చూడవచ్చు
ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రారంభమవుతుంది. దాని 258 కిలోమీటర్ల వెడల్పుతో నీడ తూర్పు వైపు ప్రయాణిస్తుంది. space.com తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రహణం స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ మధ్య ప్రాంతాలు, సూడాన్, యెమెన్, సౌదీ అరేబియా, సోమాలియాల్లో కనపడుతంది. భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనపడదు. చివరగా, ఇది హిందూ మహాసముద్రం మీదుగా సాగిపోతూ చాగోస్ ద్వీప సముదాయం సమీపంగా వెళ్తుంది.