అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇవాళ ట్రంప్ ప్రసంగిస్తూ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ సమయంలో జేడీ వాన్స్, ఉషా చిలుకూరి కూడా వేదికపైనే ఉన్నారు. ఈ ఉషా చిలుకూరి వాన్స్ పూర్వీకుల మూలాలు కష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం, సాయిపురంలో ఉన్నాయి. ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో కూడా బంధువులు ఉన్నారు.
విశాఖకు చెందిన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, 96 ఏళ్ల సీ శాంతమ్మకు ఉషా చిలుకూరి మనవరాలు అవుతారు. ట్రంప్ గెలవడంతో జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. దీంతో జేడీ వాన్స్ పేరు ఏపీలోనూ మార్మోగిపోతుంది. ఆంధ్ర అల్లుడు ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు.
తాజాగా, శాంతమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి చిలుకూరి ద్వారా తన ఫ్యామిలీకి ఉషతో కుటుంబ సంబంధం ఉందని చెప్పారు. ఉష తనకు మనవరాలు వరుస అవుతుందని అన్నారు. తన మరిది రామశాస్త్రి సొంత మనవరాలే ఉషా అని అన్నారు. కాగా, రామశాస్త్రి కుమారుడి పేరు రాధాకృష్ణ. తన భార్య లక్ష్మితో కలిసి రాధాకష్ణ 1970వ దశకంలో యూఎస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారి కుమార్తెనే ఉషా చిలుకూరి.
జేడీ వాన్స్ ఉపాధ్యక్ష పదవి స్వీకరించాక “సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా” అవబోతున్నారు మన ఉషా చిలుకూరి. ఆ హోదా సంపాదించనున్న మొట్టమొదటి భారత సంతతి మహిళ ఆమె.
Donald Trump: ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు కురిపించిన డొనాల్డ్ ట్రంప్