Donald Trump: ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు కురిపించిన డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

Donald Trump : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించబోతున్నారు. విజయం ఖాయమైన తరువాత భార్య మెలానియాతో కలిసి ప్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ కు చేరుకున్న ట్రంప్ తొలిసారి తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పలు కీలక విషయాలను ట్రంప్ ప్రస్తావించాడు. ఇది చరిత్రలో గొప్ప రాజకీయ ఘట్టం. రాబోయే సంవత్సరాలు అమెరికాకు బంగారు రోజులు అని పేర్కొన్నాడు. ఈ విజయం చారిత్రాత్మకమైనది.. అపురూపమైనది. అమెరికా భవిష్యత్తుకోసం మేము పనిచేస్తామని ట్రంప్ చెప్పాడు.
డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇటీవల స్పేస్ ఎక్స్ అంతరిక్ష ప్రయోగాన్ని ట్రంప్ ప్రశంసించారు. ఈ విజయం ప్రతి అమెరికన్ విజయం.. ఇది చరిత్రలో గొప్ప రాజకీయ ఘట్టం అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి అక్రమ చొరబాట్లు ఆగుతాయని ట్రంప్ స్పష్టం చేశాడు. అమెరికా మళ్లీ గొప్పగా ఉంటుందని అన్నారు..
మేము అసాధ్యమైనదాన్ని చేశాము.. మాకు స్వింగ్ స్టేట్స్ నుండి పూర్తి మద్దతు లభించింది. అమెరికా మాకు అపూర్వమైన, శక్తి వంతమైన మద్దతును ఇచ్చింది. మేము ఓటర్ల కోసం ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని అమలు చేయబోతున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రజలు అమెరికాకు తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే, చట్టబద్ధంగా తిరిగి రావాలని ట్రంప్ సూచించాడు.