Tesla India: ఎప్పుడో ఇండియాకు రావాల్సిన టెస్లా.. ఇంత లేటుగా ఎందుకొస్తోంది?

ఇండియాలోనే కార్లను తయారు చేయాలని మస్క్ కంపెనీ టెస్లా భావిస్తోంది. కానీ.. మొదటగా కార్ల దిగుమతి చేసుకొని.. సేల్స్ మొదలుపెట్టి.. మార్కెట్‌లో టెస్లా కార్లకు ఉన్న డిమాండ్‌ని టెస్ట్ చేయాలని చూస్తోంది.

Tesla India Entry

Tesla India Entry : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌(Elon Musk)కు చెందిన టెస్లా కార్ల కంపెనీ త్వరలోనే భారత్‌కు రాబోతోంది. అమెరికాలో భారత ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ తర్వాత స్వయంగా.. ఎలన్ మస్కే ఈ విషయం చెప్పారు. దాంతో.. ఈ విషయం వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు.. ఎప్పుడో ఇండియాకు రావాల్సిన టెస్లా.. ఇంత లేటుగా ఎందుకొస్తోంది? భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి ఉన్న అనుకూలతలేంటి? ప్రతికూల అంశాలేంటి?

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. వాళ్లిద్దరూ.. వివిధ అంశాలపై చర్చించారు. మోదీతో భేటీ తర్వాత.. ఇండియాలో టెస్లా ఎంట్రీపై మస్క్ స్పందించారు. వీలైనంత త్వరగా.. భారత్‌లో టెస్లా కార్యకలాపాలు మొదలవుతాయని.. కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. త్వరలోనే ఈ అంశంపై సానుకూల ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి.. మంచి సహకారం లభిస్తోందన్నారు మస్క్. అందుకు.. మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఒక్క ప్రకటనతోనే.. భారత్‌లో టెస్లా ఎంట్రీని తేల్చేయాలనుకోవడం లేదని.. ఇండియాతో సంబంధాల విషయంలో.. తమ నిర్ణయం కీలకంగా మారబోతోందని చెప్పారు మస్క్.

మోదీతో భేటీ అద్భుతంగా జరిగిందన్న మస్క్‌.. ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లో అవకాశాలు బాగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. భారత భవిష్యత్‌పై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ముఖ్యంగా.. ప్రధాని మోదీపై మస్క్‌ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌పై మోదీకి ఎంతో శ్రద్ధ ఉందని.. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సోలార్ ఎనర్జీలో పెట్టుబడులకు.. భారత్‌లో గొప్ప అవకాశాలున్నాయని చెప్పారు ఎలన్ మస్క్. వీటన్నింటికి మించి.. తాను ప్రధాని మోదీకి అభిమానినని మస్క్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. వివిధ రంగాలలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ చేస్తున్న కృషిని.. ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, కమర్షియల్ స్పేస్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు.. భారత్‌లో ఉన్న అవకాశాలను అన్వేషించాలని మస్క్‌ని ఆహ్వానించారు.

ఇక.. ఎలన్‌ మస్క్‌తో భేటీ గొప్పగా జరిగినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇంధనం నుంచి ఆధ్యాత్మికత వరకు వివిధ రకాల అంశాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. మీతో మళ్లీ సమావేశం కావడం గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ భేటీ కంటే ముందు.. ప్రధాని మోదీ, ఎలన్ మస్క్.. 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీలో చివరగా కలుసుకున్నారు. వాస్తవానికి.. టెస్లా ఎప్పుడో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. ఇండియా కేంద్రంగా.. నాలుగు మోడళ్లు విక్రయించేందుకు ఆమోదం కూడా పొందింది. కానీ.. టెస్లా కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న కంపెనీ అభ్యర్థనను భారత్ నిరాకరించింది. దాంతో.. టెస్లా అక్కడే ఆగిపోయింది.

తాజాగా.. ఇండియాలోనే కార్లను తయారు చేయాలని మస్క్ కంపెనీ టెస్లా భావిస్తోంది. కానీ.. మొదటగా కార్ల దిగుమతి చేసుకొని.. సేల్స్ మొదలుపెట్టి.. మార్కెట్‌లో టెస్లా కార్లకు ఉన్న డిమాండ్‌ని టెస్ట్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం.. ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్పటితో పోలిస్తే.. ఇండియాలో ఇప్పుడు ఈవీలకు మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ కూడా ఓపెన్ అయింది. ఇప్పటికే.. దేశీయ కార్ల కంపెనీలు ఈవీలు తయారుచేస్తూ.. బాగానే అమ్ముతున్నాయి. వాహనదారులు కూడా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో.. ఎలాగైనా ఇండియా మార్కెట్‌ని కంపెనీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో మస్క్.. భారత్‌లోకి టెస్లాను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయే సేల్స్, ఎగుమతుల కోసం ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయడమే లక్ష్యంగా.. భారత్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని టెస్లా చూస్తోంది.

Also Read: న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటి

టెస్లా కంపెనీ విస్తరణకు భారత్‌ని ఓ అద్భుతమైన ప్రాంతంగా ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. అయితే.. ఇండియా మార్కెట్‌లో దేశీయ కార్లకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. పైగా.. ఇప్పుడిప్పుడే.. భారత్‌లో ఈవీల వాడకం పెరుగుతోంది. ఇతర దేశాలకు చెందిన కార్ల కంపెనీలు.. పెట్రోల్ వేరియంట్లలో కార్లను తయారుచేస్తూనే.. నెమ్మదిగా ఈవీల ప్రొడక్షన్ మొదలుపెట్టాయి. దాంతో.. సేల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాయి. కానీ.. టెస్లా అలా కాదు. పూర్తిగా.. ఎలక్ట్రిక్ కార్లనే ఉత్పత్తి చేస్తుంది. పైగా.. దాని బ్రాండ్‌కు తగ్గట్లే.. రేట్లు కూడా ఉంటాయి. అందువల్ల.. సంపన్నులు మాత్రమే టెస్లా కార్లపై ఆసక్తి చూపే అవకాశముందనే లెక్కలున్నాయి. వీటన్నింటిని.. టెస్లా ఎలా అధిగమిస్తుందన్నదే మెయిన్ పాయింట్. కానీ.. ఇండియాలో కార్లను తయారుచేసి.. ఇక్కడ సేల్ చేయడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటే తప్ప.. టెస్లాకు వర్కవుట్ కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.