ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సూర్యగ్రహణంతో తగ్గుతుందా? సూర్యుని ద్వారా వచ్చింది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సూర్యగ్రహణంతో తగ్గుతుందా? సూర్యుని ద్వారా వచ్చింది కనుక ఇవాళ్టి గ్రహణంతో కరోనా అంతం అవుతుందా? గ్రహణానికి, కరోనా వైరస్ కి సంబంధం ఉందా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. జూన్ 21 సూర్యగ్రహణం ఏర్పడనుందని వార్త తెలిసినప్పటి నుంచి ఒక ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే సూర్యగ్రహణంతో కరోనా అంతం. సూర్యగ్రహణం వేళ వచ్చే అతినీలలోహిత కిరణాలు కరోనా వైరస్ ను హరిస్తాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 21 తర్వాతి రోజు నుంచి కరోనా వైరస్ క్రియారహితంగా మారుతుందని నమ్ముతున్నారు. దీని గురించి పండితులు ఒకలా, సైంటిస్టులు మరోలా చెబుతున్నారు. ఎవరి వాదనలు వారు బలంగా వినిపిస్తున్నారు. ఇంతకీ సూర్యగ్రహణంతో కరోనా అంతమైపోతుందా? వైరస్ తీవ్రత తగ్గుతుందా? వైరస్ క్రియారహితంగా మారనుందా? అసలు ఇందులో వాస్తవం ఎంత? ఏది నిజం?
సూర్యగ్రహణంతో కరోనా వైరస్ అంతం అవాస్తవం:
దీని గురించి సైంటిస్టులు స్పందించారు. అంతా అవాస్తవం అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. సూర్యుని ద్వారా కరోనా వచ్చిందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అలాగే నేటి గ్రహణంతో కరోనా అంతం అవుతుందనేది లేదా తగ్గుతుందనేది కూడా అవాస్తవం అని స్పష్టం చేశారు. అసలు గ్రహణానికి కరోనా వైరస్ కి సంబంధమే లేదని బల్లగుద్ది మరీ చెప్పారు. గ్రహణం కారణంగా భూమిపైకి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేరకు అంటే 0.001 శాతం మాత్రమే నశించే అవకాశం ఉంటుంది తప్ప 100శాతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది:
భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ చేస్తారు. ఆ మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. కాగా గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెబుతుంటారు. అయితే హేతువాదులు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తున్నారు.
ఖగోళంలో అద్భుతం:
ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం(జూన్ 21,2020) ఏర్పడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం.
ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం, మళ్లీ డిసెంబర్ లోనే:
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కనిపించింది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై…మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాలకు ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ఏపీలో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది.
చూడామణి యోగంలో జపం, దాన, ధర్మాలు చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం:
జ్యోతిషం ప్రకారం.. శార్వరీ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిర నక్షత్రం, మిథున రాశిలో రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది దక్షిణభారతంలో ఖండగ్రాసం, ఉత్తర భారతంలో కంకణాకారంలో కనిపిస్తుంది. దీన్నే ‘చూడామణి యోగం’అని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇది విశేషమైన సూర్యగ్రహణమని పండితులు అంటున్నారు. ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం, సోమవారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడితే దాన్ని చూడామణి యోగంగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సాధారణ గ్రహణ సమయంలో చేసే జపం, దాన, ధర్మాలు చూడామణి యోగంలో చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Read: దేశంలో కొత్తగా 15,413 కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు