ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ…పంజా విసిరిన చిరుత

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 09:21 AM IST
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ…పంజా విసిరిన చిరుత

Updated On : March 12, 2019 / 9:21 AM IST

ఈ కాలం యూత్‌లో సెల్ఫీ పిచ్చి ఒక పెద్ద రోగంలా మారింది. ఏం చేసినా ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది.  లైక్స్, కామెంట్స్ కోసం దేనికైనా తెగించడం, ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారింది. సెల్ఫీ వల్ల కొంతమంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఆరిజోనాలో ఓ యువతి ఇలాంటి రిస్కే చేసింది. జూలో చిరుతతో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది.

లిచ్‌ఫీల్డ్ పార్క్‌లోని జూలో ఓ యువతి నల్ల చిరుతతో సెల్ఫీ దిగేందుకు సరదా పడింది. కాని దూరం నుంచి ఫొటో తీసుకోకుండా దగ్గరకు వెళ్లి అక్కడున్న ఫెన్సింగ్ ఎక్కేసింది. కెమెరా ఓపెన్ చేసి పోజిచ్చేలోపు.. వెనకాల నుంచి చిరుత వచ్చి దాడిచేసింది. గోళ్లతో ఆమె చేతిపై రక్కేసింది దాంతో ఆమె ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడే ఉన్న ఓ మహిళ.. చిరుత దృష్టిని మరల్చేందుకు తెలివిగా బోను లోపలికి బాటిల్ విసిరేసింది. వెంటనే చిరుత ఏదో పడిందని  బాటిల్ దగ్గరకు వెళ్లింది. అప్పటికే అప్రమత్తమంగా ఉన్న ఇతర సందర్శకులు చాకచక్యంగా ఆ యువతిని వెనక్కి లాగేశారు. దాంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.