World Bicycle Day: ఆకలి కోసం కొందరు.. ఆరోగ్యం కోసం మరికొందరు.. తొక్కితే మంచిదేగా!

సైకిల్ ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా ముందుకు సాగేందుకు సాయం చేసే వాహనం.. రెండు చక్రాల సైకిల్ ఆకలి తీర్చుకునేందుకు వెళ్లడానికి వాడుకుంటారు కొందరు.. మరికొందరు ఆరోగ్యం కోసం తొక్కుతారు.

World Bicycle Day, 3rd June: సైకిల్ ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా ముందుకు సాగేందుకు సాయం చేసే వాహనం.. రెండు చక్రాల సైకిల్ ఆకలి తీర్చుకునేందుకు వెళ్లడానికి వాడుకుంటారు కొందరు.. మరికొందరు ఆరోగ్యం కోసం తొక్కుతారు. ఏదైనా రోజూ సైకిల్ తొక్కడం మాత్రం మంచిది అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ దినోత్సవం జరుపుతారు.

2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్స‌వంగా జరపనున్నట్లుగా ప్రకటించింది. సైక్లింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా కారణంగా, వీధుల్లో ప్రజలు తిరగడం తగ్గినా, కానీ చాలా మంది ప్రజలు తమను తాము ఆరోగ్యంగా ఉంచడానికి సైకిళ్లను ఉపయోగిస్తున్నారు.

సైక్లింగ్ బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, కండరాలను బలోపేతం చేస్తుంది. పర్యావరణపరంగా కూడా సైక్లింగ్ చాలా మంచి చర్య, పర్యావరణ కాలుష్యం లేకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అలాగే, సైక్లింగ్ కోసం ఇంధనం ఖర్చు అవసరం ఉండదు. శరీరానికి ఉత్తమమైన వ్యాయామాలలో సైక్లింగ్ ఒకటి.. కాబట్టి సైక్లింగ్ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ప్రపంచ సైకిల్ దినోత్సవంకు ఏప్రిల్ 2018లో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త‌ ప్రచారం చేయగా, తుర్క్మెనిస్తాన్ మ‌రియు 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా జూన్ 3న ప్ర‌పంచ సైకిల్ దినోత్స‌వం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

ఎందుకు జరుపుకుంటున్నారు?

సమయానికి చేరుకోవాలంటే మోటారు సైకిళ్లు బెస్ట్ అనే ఆలోచనతో చాలామంది సైక్లింగ్ తగ్గించేశారు. వాహనాల వాడకంతో దినచర్యలో సైకిళ్ల ప్రభావం తగ్గిపోయింది. విద్యార్ధులు, పిల్లలు సైతం సైకిల్ వాడకాన్ని పోనుపోను తగ్గిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, సైకిళ్ల వాడకం గురించి ప్రజలకు మరియు పిల్లలకు అవగాహన కలిగించడానికి, సమాజంలో సైక్లింగ్ చేసేవారి నిష్పత్తిని పెంచడానికి ఇలా ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుతున్నారు.

చాలా దేశాలలో, ఈ రోజున సైకిల్ ర్యాలీలు, రేసులు నిర్వహిస్తారు. దీనిలో ప్రజలు పాల్గొంటారు. కానీ కరోనా కారణంగా, ఇటువంటి కార్యక్రమాలు ఈ ఏడాది ఎక్కడా కనిపించట్లేదు. అటువంటి పరిస్థితిలో, ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాపై ఆన్‌లైన్ ద్వారా కూడా చర్చించుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు