Tiger Urine : పులి యూరిన్ అమ్ముతున్న జూ.. బాటిల్ రూ.596 అట.. ఆ రోగం తగ్గుతుందని ప్రచారం చేసి..

సగటున ప్రతిరోజు రెండు సీసాల కంటే ఎక్కువ అమ్మడం లేదని జూ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.

Tiger Urine : ఏంటి షాక్ అయ్యారా.. పులి మూత్రం అమ్మడం ఏంటని విస్తుపోతున్నారా? దాంతో రోగం తగ్గటం ఏంటని అవాక్కవుతున్నారా? అవును.. అక్కడ పులి మూత్రం (టైగర్ యూరిన్) అమ్ముతున్నారు. అది కూడా బాటిల్ ధర 596 రూపాయలట. మ్యాటర్ ఏంటంటే.. పలు రకాల ఆరోగ్య సమస్యలకు సంప్రదాయ పద్దతుల్లో ఔషధాలు తయారు చేస్తారనే విషయం తెలిసిందే.

జంతువుల ఉత్పత్తులను వినియోగించి ఈ మందులను తయారు చేస్తారు. అంటే కొన్ని జంతువుల కొవ్వు, విషం, తేనె.. ఇలాంటి ఉత్పత్తులు వినియోగించి పలు రకాల జబ్బులకు ఔషధాలు తయారు చేస్తుంటారు. కొన్ని జంతువుల ఉత్పత్తులు ఔషధ గుణాలు కలిగుంటాయనే విషయం విదితమే. ఇదే కోవలో.. ఇప్పుడు పులి మూత్రం కూడా చేరింది.

కీళ్ల నొప్పి, వాపులు, కండరాల నొప్పి వంటి రోగాలను తగ్గిస్తుందట..
చైనాలోని ఓ జూ.. పులి మూత్రాన్ని అమ్ముతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ప్రముఖ యాన్ బిన్ ఫెన్ జియా వైల్డ్ లైఫ్ జూ.. సైబీరియన్ పులుల మూత్రాన్ని విక్రయిస్తోంది. జంతు ప్రదర్శనశాల.. పులి మూత్రం బాటిళ్లను ఒక్కొక్కటి 596 రూపాయలకు అమ్ముతోంది. ఒక్కో సీసాలో 250 గ్రాముల పదార్థం ఉంటుంది.

ఈ సైబీరియన్ పులుల మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పి), బెణకటం వల్ల కలిగే వాపులు, కండరాల నొప్పి వంటి రోగాలను తగ్గిస్తుందని చెబుతూ విక్రయం చేస్తోంది.

Also Read : మీర్ పేట్ మాధవి కేసులో గురుమూర్తి అరెస్ట్.. పోలీసులే ఆశ్చర్యపోయే విషయాలు..

వైట్ వైన్, అల్లం ముక్కలతో కలిపి పట్టించాలి..
అంతేకాదు.. పులి యూరిన్ ఎలా ఉపయోగించాలో కూడా గైడ్‌ చేస్తోంది. పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో కలపాలి. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ పట్టించాలట. అంతేకాదు.. ఆ మూత్రాన్ని తాగొచ్చని కూడా జంతు ప్రదర్శనశాల సిబ్బంది సెలవిచ్చారు. అయితే అలర్జీలు ఉన్న వ్యక్తులు దానిని తీసుకోకుండా ఉండాలని చెప్పారు.

రోజూ రెండు సీసాల మూత్రం మాత్రమే విక్రయం..
పులి నుండి మూత్రాన్ని బేసిన్‌లో సేకరిస్తామని జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది తెలిపారు. పులి మూత్రం అమ్మకాలు పరిమితంగా ఉన్నాయన్నారు. అయితే, సగటున ప్రతిరోజు రెండు సీసాల కంటే ఎక్కువ అమ్మడం లేదని జూ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. 2014లో జూ బహిరంగ రియాలిటీ షోలో ప్రముఖ పోటీదారులకు పులి మూత్రాన్ని బహుమతిగా ప్రదానం చేసినట్లు తెలిపారు.

అందులో నిజం లేదన్న వైద్య నిపుణులు..
కాగా, పులి మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని, పలు రోగాలను నయం చేస్తుందని జూ నిర్వాహకులు చెబుతున్న వాదనను వైద్య నిపుణులు ఖండించారు. వారు విస్మయం వ్యక్తం చేశారు. పులి మూత్రానికి సంబంధించిన మెడిసినల్ క్లెయిమ్‌లను వారు తోసిపుచ్చారు. ఇందులో నిజం ఉండే అవకాశమే లేదన్నారు.

అంతేకాదు.. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో పులి మూత్రం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని క్లారిటీ ఇచ్చారు. పులి మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేందుకు శాస్త్రీయ రుజువులు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

Also Read : డీప్‌‍సీక్ ఏఐ.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ చైనా స్టార్టప్ కంపెనీ గురించి 10 ఆసక్తిర విషయాలివే

పులుల సంరక్షణపై ఆందోళన..
పులి మూత్రం వంటి ధృవీకరించబడని చికిత్సలను ప్రోత్సహించడం సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని తప్పుగా సూచించడమే కాకుండా పులుల సంరక్షణ ప్రయత్నాలను కూడా దెబ్బతీస్తుందని స్థానిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లో టైగర్ యూరిన్ ని ఉపయోగించకుండా ఉండాలని కోరారు.

ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. పులి మూత్రాన్ని విక్రయించడానికి చెల్లుబాటు అయ్యే వ్యాపార లైసెన్స్‌ను తాము కలిగి ఉన్నామని జంతుప్రదర్శనశాల ప్రతినిధులు తెలిపారు.