Ukraine vs Russia War: రష్యాతో యుద్ధాన్ని ఆపేస్తామన్న జెలెన్ స్కీ.. కానీ, ఆ షరతులు వర్తిస్తాయి

రష్యా - యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.

ukraine president Zelensky

Zelenskyy: రష్యా – యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రెండు దేశాలు వెనక్కి తగ్గేందుకు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. కొద్దికాలంగా ఇరుదేశాల మధ్య దాడుల తీవ్ర తగ్గినప్పటికీ.. ఇటీవలి కాలంలో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యుక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో పెద్దెత్తున ఆయుధాలను సరఫరా చేస్తోంది. కీవ్ కు తాము అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై యుద్ధంలో వాడుకోవచ్చని బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని తీవ్రంగా ఖండించిన రష్యా మళ్లీ యుక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది.

Also Read: నట్టేట ముంచిన త్యాగం..! ఆ అణ్వాయుధాలే ఉంటే యుక్రెయిన్‌ మరోలా ఉండేదా? రష్యాకు చుక్కలు చూపించేదా?

నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్నాడు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ కు అందజేసేందుకు దాదాపు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను సిద్ధం చేస్తునట్లు తెలిసింది. ఇందులో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ క్షిపణులతో పాటు హై మొబలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ ను అందించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో రష్యా సైన్యం యుక్రెయిన్ పై దాడులను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశాడు.

 

ప్రస్తుతం కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే మిగిలిన భూభాగాన్ని రష్యాకు ఇచ్చేందుకు అంగీకరిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. శుక్రవారం బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న యుక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. ఆ తరువాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని నాటోలో చేర్చుకోవాలి. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుంది’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.